* వరంగల్ తూర్పులో ఘనంగా ‘ఈద్ కా తోఫా’..
* ముస్లిం సోదరులకు తోఫా అందజేసిన మంత్రి కొండా సురేఖ
* క్రిస్టల్ గార్డెన్లో సందడి…ఘనంగా రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం.
* ప్రభుత్వ కానుకలతో ముస్లింల ముఖాల్లో చిరునవ్వు.. పాల్గొన్న కలెక్టర్ సత్య శారద
ఆకేరు న్యూస్, వరంగల్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఈద్ కా తోఫా’ పంపిణీ కార్యక్రమం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక క్రిస్టల్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గంగా-జమునా తెహజీబ్కు ప్రతీక అయిన మన రాష్ట్రంలో అన్ని పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. ముస్లిం సోదరులు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కానుకలను అందజేస్తోందని పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు స్వయంగా ఈద్ తోఫా కిట్లను పంపిణీ చేసి, వారికి రంజాన్ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు. అధికార యంత్రాంగం సమన్వయంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ కానుకలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు ఫుర్ఖాన్, సోమిశెట్టి ప్రవీణ్ కుమార్లతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్డీవో సుమ, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి (డిఎండబ్ల్యూఓ) రమేష్, బల్దియా డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, తహసీల్దార్లు ఇక్బాల్, శ్రీకాంత్ తదితరులు ఈ పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరైన ఈ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో ముగిసింది.
