* మొదటి ప్రాధ్యాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి
* రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కంపు ప్రారంభం
ఆకేరు న్యూస్, వరంగల్ : నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduate MLC) ఓట్ల లెక్కింపు ఇంకొ కొనసాగుతూనే ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటివరకు 26 మంది ఎలిమినేట్ అయ్యారు. 27వ అభ్యర్థి ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. ఎలిమినేషన్ రౌండ్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు (Teenmar Mallanna) 220 ఓట్లు రాగా, టీఆర్ఎస్కు 139 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి 118, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 76 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు మల్లన్న 18వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక గెలుపు కోటా ఓట్లను 1,55,095గా నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు ముగిసేసరికి మల్లన్న గెలవాలంటే ఇంకా 32,282 ఓట్లు కావాల్సి ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి (Anugula Rakesh Reddy) గెలుపునకు 50,847 ఓట్లు రావాల్సి ఉంది. ఈసారి 25,824 ఓట్లను చెల్లనవిగా అధికారులు గుర్తించారు.
అవకతవకలు.. ఫిర్యాదులు..
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈమేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వాస్తవ లెక్కలకు, నమోదు చేస్తున్న లెక్కలకు సరిపోలడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి గురువారం రాత్రి బీఆర్కేఆర్ భవన్‌కు వెళ్లి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అవకతవకలపై ఆర్వో దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి ప్రయత్నించినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ఏజెంట్ల సంతకాలు లేకుండా, అభ్యర్థికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అభ్యర్థి, ఏజెంట్ల అభ్యంతరాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా లెక్కింపు చేస్తున్నారని కౌశిక్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.
————————-