* యాప్‌లో డిపార్ట్మెంట్ సమాచారం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు దడ పుట్టిస్తున్నారు. ఫోన్లు, మెసేజ్‌లు, లింక్‌లు.. పంపి ఖాతాలు కొల్లగొడుతున్నారు. నేరాల బారిన పడితే వెంటనే ఫిర్యాదు చేయండి.. అని సామాన్యులకు భరోసా ఇచ్చే పోలీసులకే ఇప్పుడు చెమటలు పట్టించారు. తెలంగాణ పోలీస్ యాప్‌లను హ్యాక్ చేశారు. మూడు రోజుల క్రితం హాక్ ఐ యాప్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు తాజాగా టీఎస్ కాప్ యాప్‌ను హ్యాక్ చేశారు. ఈయాప్‌లో డిపార్ట్ మెంట్‌కు చెందిన సమాచారం ఉంటుంది. దాదాపు అందులో 12 లక్షల మందికి చెందిన డేటా ఉన్నట్లు సమాచారం. ఆ సమాచారాన్ని ఆన్లైన్ లో నేరగాళ్లు అమ్మకానికి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. త్వరలోనే నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా దర్యాప్తు చేపడుతున్నారు. యాప్ లోని సమాచారం బయటకు పోకుండా సాంకేతిక నిపుణుల సహాయంతో ఎక్కడికక్కడ అరికడుతున్నారు.
మూడు రోజుల క్రితమే..
మూడు రోజు క్రితం తెలంగాణ పోలీస్ ‘హాక్-ఐ’ యాప్ హ్యాకింగ్ బారిన పడింది. ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు అనుగుణంగా ఈ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్ హ్యాకింగ్‌కు గురి కావడంతో కీలక సమాచారం హ్యాకర్ల చేతికి వెళ్లింది. ఎవరైనా సమాచారం ఇచ్చేందుకు, ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌లో దాదాపు 2 లక్షల మంది ఆధార్, ఫోన్ నెంబర్లతో పాటు ఇతర వివరాలు ఉన్నాయి. ఈ సమాచారం అపహరణకు గురైనట్లుగా భావిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. హ్యాకర్ల కోసం గాలిస్తున్నారు. అపహరణకు గురైన సమాచారంతో హ్యాకర్లు బెదిరింపులకు పాల్పడే అవకాశముందని భావిస్తున్నారు. ఇంతలోనే నేరగాళ్లు టీఎస్ కాప్ యాప్‌ను కూడా హ్యాక్ చేశారు.
————————————