Justice Yashwant Varma resignation
*రాష్ట్రపతికి రాజీనామా లేఖ
*అభిశంసన ముంగిట తప్పుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మ
*కాలిపోయిన నోట్ల కట్టలు.. సుదీర్ఘ విచారణ..
*చివరకు పదవికి వీడ్కోలు పలికిన న్యాయమూర్తి.
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థలో పెను సంచలనం చోటుచేసుకుంది. తన నివాసంలో భారీగా నగదు పట్టుబడిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఏప్రిల్ 9వ తేదీన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
*ఏమిటీ వివాదం?
గత ఏడాది మార్చి 14వ తేదీ రాత్రి ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పడానికి వెళ్లిన ఫైర్ సిబ్బందికి అక్కడ స్టోర్ రూమ్లో కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించాయి. ఈ వార్త మీడియాలో రావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అప్పట్లో ఢిల్లీ హైకోర్టులో ఉన్న ఆయనను వెంటనే అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.
*అభిశంసన ప్రక్రియ ముంగిట..
ఈ అవినీతి ఆరోపణలపై లోక్సభ స్పీకర్ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించారు. జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించేందుకు (అభిశంసన) 146 మంది ఎంపీలు తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. విచారణ కమిటీ తన నివేదికలో ఆరోపణలు వాస్తవమేనని ప్రాథమికంగా తేల్చింది. అయితే, తనకు సరైన న్యాయం జరగలేదని, విచారణ కమిటీ నివేదికను రద్దు చేయాలని జస్టిస్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఆయనకు ఊరట లభించలేదు.
*నాకు అన్యాయం జరిగింది: జస్టిస్ వర్మ…
రాజీనామా లేఖతో పాటు కమిటీకి పంపిన 13 పేజీల నోట్లో ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. “ఒక సిట్టింగ్ జడ్జి పట్ల జరిగిన అనుచిత వ్యవహారాన్ని చరిత్ర గుర్తిస్తుందనే ఆశతోనే నేను తప్పుకుంటున్నాను. ఆ స్టోర్ రూమ్ తాళం చెవి కూడా నా దగ్గర ఉండేది కాదు, ఆ నగదుతో నాకు ఎలాంటి సంబంధం లేదు” అని ఆయన స్పష్టం చేశారు. తనపై కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు.
ఈ రాజీనామాతో ప్రస్తుతం కొనసాగుతున్న అభిశంసన ప్రక్రియకు బ్రేక్ పడే అవకాశం ఉంది. 1992లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన జస్టిస్ వర్మ, 2014లో జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
