CPI leader Thakkallapalli Srinivasa Rao Electricity Reforms CPI Protest
* విద్యుత్ పోరాట అమరుల స్ఫూర్తితో ఉద్యమించాలి
– సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
ఆకేరు న్యూస్ , హనుమకొండ: విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించి ప్రజలను దోచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. విద్యుత్ పోరాట అమరుల స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ కార్యాలయంలో విద్యుత్ పోరాట అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ రంగంలో కొత్త విధానాలను తీసుకొస్తోందని ఆయన అన్నారు. రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి వారిపై అదనపు ఆర్థిక భారం మోపేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడం ద్వారా రైతాంగంతో పాటు అన్ని వర్గాల ప్రజలపై పెనుభారం మోపే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్రాల పరిధిలోని విద్యుత్ రంగంపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చెలాయించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని శ్రీనివాసరావు పేర్కొన్నారు. విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ సంస్కరణలను ముందుకు తీసుకొస్తోందని ఆరోపించారు.
* అమరుల స్పూర్తి తో..
2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్ పోరాటంలో అమరులైన వారి స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. నాటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, పోలీసు నిర్బంధాన్ని ధిక్కరించి ప్రజల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన విద్యుత్ పోరాట అమరుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడటమే అమరులకు అర్పించే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, జిల్లా నాయకులు ఎన్. అశోక్ స్టాలిన్, ఏదునూరి వెంకట్రాజం, కొట్టెపాక రవి, మునిగాల బిక్షపతి, వేల్పుల సారంగపాణి, కండె నర్సయ్య, ఆలకుంట్ల యాకయ్య, చిలుకల బాబు, వెంకటేష్, ఉస్మాన్ పాషా తదితరులు పాల్గొన్నారు.
————————

Please tell us what is wrong. Your report will be sent to the website team.
