* వాజ్‌పేయి నాటిన విత్తనం
* ప్రభుత్వం నడిపేందుకు మెజార్టీ అవసరం
* అందరి సహకారం తీసుకుంటాం
* కార్యకర్తలకు శిరస్సు వహించి ప్రణామం చేస్తున్నా
* దేశాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నా
* తెలంగాణ, కర్ణాటకలో ప్రజలు అక్కున చేర్చుకున్నారు
* పవన్ వల్లే ఏపీలో భారీ విజయం సాధించాం
* మూడోసారి ఎన్డీఏ నేతగా ఎన్నుకున్న అందరికీ ధన్యవాదాలు
* ఎన్డీఏ పక్షాల సమావేశంలో నరేంద్రమోదీ
ఆకేరు న్యూస్ డెస్క్ : నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (NDA) అనేది భారతదేశపు ఆత్మ అని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. వాజ్‌పేయి (Vajpayee) ఇతర పెద్దలు నాటిన విత్తనం అన్నారు. 30 ఏళ్లుగా ఎన్డీయే కూటమి నడుస్తోందని తెలిపారు. న్యూఢిల్లీలోని పార్లమెంట్ సంవిధాన్ భవన్లో శుక్రవారం ఎన్డీఏ (NDA) పక్షాల సమావేశం జరిగింది. సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా మిత్రపక్షాల తరఫున మోదీ పేరును రాజ్‌నాథ్ ప్రతిపాదించగా, అమిత్ షా, నడ్డా, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నితీశ్‌కుమార్, ఏకనాథ్ షిండే తదితరులు బలపరిచారు. ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ఎన్డీఏ కార్యకర్తలందరికీ శిరస్సు వంచి ప్రణామం చేశారు. మూడోసారి ఎన్డీఏ పక్షనేతగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. దేశాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్డీఏ పక్షాల కార్యకర్తలు మండే ఎండలను సైతం అధిగమించి రాత్రింబవళ్లు శ్రమించి పనిచేయడం వల్లే మూడోసారి కూడా అధికారం వచ్చిందన్నారు. నాపై విశ్వాసం ఉంచి ఎన్డీఏ నేతగా ఎన్నుకున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. దేశానికి ఇంకా సేవ చేసే భాగ్యం దక్కిందన్నారు. గోవా, ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారని, అక్కడ కూడా సేవ చేసే భాగ్యం దక్కిందని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ అవసరమని, దేశాన్ని ముందుకు నడిపించేందుకు అందరి సహకారం తీసుకుంటామని వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఏర్పడిన ఏ కూటమి కూడా ఎన్డీఏ(NDA)లా విజయవంతం కాలేదని తెలిపారు. 22 రాష్ట్రాల్లో ప్రజలు ఎన్డీఏ (NDA) కు అధికారం ఇచ్చారని వెల్లడించారు.
పవన్ అంటే పవనం కాదు.. తుఫాన్
తమిళనాడు(Tamil Nadu) లో మనకు ఇప్పుడు సీట్లు రాకపోవచ్చు.. కానీ మున్ముందు ఏం జరగనుందో చూద్దామని మోదీ అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వల్లే ఏపీలో భారీ విజయం సాధించామని పేర్కొన్నారు. పవన్ అంటే పవనం కాదని, తుఫాన్ అని కొనియాడారు. ఏపీ విజయం సామాన్యుడి ఆకాంక్షల ప్రతిరూపమని చాటి చెప్పారు. ఎన్టీయే పక్షాలు అందరిలో ఒక పోలిక ఉందని, అదే సుపరిపాలన అని వెల్లడించారు. పేదరిక నిర్మూలనతోనే దేశాభివృద్ధి సాధ్యం అన్నారు.
తెలంగాణలో విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్
కర్ణాటక(Karnataka) .. తెలంగాణ(Telangana) లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, త్వరగానే ఆ ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని మోదీ వెల్లడించారు. అక్కడి ప్రజలు ఎన్డీఏను అక్కున చేర్చుకున్నారన్నారు. ఈవీఎంల గురించి భయపెట్టిన వారిని దేశం క్షమించదు అని ఇండియా కూటమిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గెలుపును ఎంతలా ఆస్వాదిస్తామో.. పరాజితులను కూడా అంతే గౌరవిస్తామని తెలిపారు. అందరినీ గౌరవించడం ప్రజాస్వామ్యం మనకు నేర్పుతుందని అన్నారు.
—————————