Fake CISF officer Shamshabad
* కొంప ముంచిన సెల్యూట్
* నకిలీ సీఐఎస్ ఎఫ్ అధికారి గుట్టురట్టు
హైదరాబాద్, ఆకేరు న్యూస్: సినిమా లెవల్ విలనీని తలపిస్తూ, ఖాకీ యూనిఫాం అడ్డుపెట్టుకొని అక్షరాలా 67 మంది మహిళల జీవితాలతో ఆడుకున్న ఒక ఘరానా మోసగాడి ఆట కట్టైంది. తాను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అధికారిని అని చెప్పుకుంటూ, శంషాబాద్ విమానాశ్రయంలో హల్చల్ చేస్తున్న నిందితుడిని భద్రతా దళాలు పక్కా ప్లాన్‌తో పట్టుకున్నాయి. నిందితుడిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాలకృష్ణగా గుర్తించారు.
* శంషాబాద్ అడ్డా
శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాలకృష్ణ, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి మోసాల బాట పట్టాడు. సమాజంలో గౌరవం, ఎవరూ ప్రశ్నించలేని అధికారం కావాలని భావించి ‘నకిలీ అధికారి’ అవతారమెత్తాడు. ఇందుకోసం అత్యంత ఖరీదైన CISF యూనిఫాం, నకిలీ ఐడెంటిటీ కార్డులు, అధికారిక ముద్రలను పోలిన పత్రాలను సృష్టించుకున్నాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తాను పెద్ద హోదాలో ఉన్నానని నమ్మించేలా అక్కడి పరిసరాల్లో తిరుగుతూ ఫోటోలు, వీడియోలు తీసుకునేవాడు.
*మ్యాట్రిమొనీనే వేట క్షేత్రం.. 67 మంది బాధితులు
బాలకృష్ణ మోసాలన్నీ సోషల్ మీడియా మరియు మ్యాట్రిమొనీ వెబ్సైట్ల ద్వారానే మొదలయ్యాయి. మ్యాట్రిమొనీ సైట్లలో తానొక ‘క్లాస్-1’ అధికారిని అని ప్రొఫైల్ క్రియేట్ చేసేవాడు. ఖాకీ డ్రెస్సులో ఉన్న ఫోటోలను చూసి అమాయక యువతులు, వారి తల్లిదండ్రులు నిజమైన అధికారి అని నమ్మేవారు
పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారితో మాటలు కలిపేవాడు. నమ్మకం కుదిరిన తర్వాత.. “ఆఫీసులో అత్యవసర పని ఉంది”, “కుటుంబంలో మెడికల్ ఎమర్జెన్సీ” లేదా “ప్రమోషన్ కోసం కొంత ఖర్చు అవుతుంది” అంటూ లక్షలాది రూపాయలు కాజేసేవాడు.
* ఇలా పట్టుబడ్డాడు
దాదాపు 67 మంది మహిళలను పెళ్లి పేరుతో వంచించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కొందరిని వివాహం చేసుకుని కొద్దిరోజులకే డబ్బుతో ఉడాయించగా, మరికొందరిని నిశ్చితార్థం దశలోనే ముంచేశాడు. గత కొన్ని రోజులుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో బాలకృష్ణ కదలికలు అనుమానాస్పదంగా మారాయి. డ్యూటీలో లేకపోయినా యూనిఫాంతో తిరుగుతుండటం, అతని సెల్యూట్ చేసే విధానం, ప్రవర్తనలో తేడాలను గమనించిన అసలైన సీఐఎస్ ఎఫ్ ( CISF ) నిఘా విభాగం నిందితుడిని అదుపులోకి తీసుకుంది. తమ దైన పద్దతిలో విచారించగా అతని వద్ద ఉన్న ఐడీ కార్డు ఫేక్ అని తేలింది. దీంతో అధికారులు షాక్‌కు గురయ్యారు.

నిందితుడు బాలకృష్ణను శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని సెక్షన్ 420 (చీటింగ్), 419 కింద కేసులు నమోదు చేశారు. అతని వద్ద ఉన్న ఫోన్ డేటాను విశ్లేషించగా వందలాది మంది యువతుల కాంటాక్ట్స్ బయటపడ్డాయి. ఈ మోసగాడి వెనుక ఇంకెవరైనా ఉన్నారా? లేదా ఒంటరిగానే ఈ నెట్వర్క్ నడుపుతున్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇలాంటి ఘటనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. మ్యాట్రిమొనీలో పరిచయమయ్యే వ్యక్తుల ఉద్యోగ వివరాలను ఆయా ఆఫీసులకు వెళ్లి స్వయంగా ధృవీకరించుకోవాలని, ఆన్లైన్ మోసగాళ్ల పట్ల కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు.
————–
