Road safety pledge Ambedkar Jayanti
* ప్రాణాలు కాపాడుకోవడమే మహనీయుడికిచ్చే నిజమైన నివాళి
* రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేద్దాం- ప్రాణాలను కాపాడుకుందాం
* రాష్ట్రంలో ప్రమాదాల శాతం సున్నాకు చేరుకోవాలన్నదే లక్ష్యం
ఆకేరు న్యూస్, కమలాపూర్:
కేవలం చట్టాలు, జరిమానాలతోనే మార్పు రాదని, ప్రతి ఇంట్లో రోడ్డు భద్రతపై అవగాహన పెరగాలని కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూనే, మన ప్రాణాలను మనం కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయడం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ లో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు భీమ్ రావ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి. స్థానిక జడ్.పి.హెచ్.ఎస్ బాలికల పాఠశాలలో జరిగిన వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి, అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని, ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని ఆయన అన్నారు. మహనీయుడు చెప్పిన విధంగా చదువు ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, యువత విద్యపై దృష్టి సారించాలని, విలువలతో కూడిన విద్యాబుద్ధులు నేర్చుకోవాలి అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణకు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని, మహనీయుడు అంబేడ్కర్ సాక్షిగా రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.
పోలీస్ శాఖ ప్రజల ప్రాణాలు కాపాడాలనే సంకల్పంతో అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతోందని ఏసీపీ స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే పోలీస్ డిపార్ట్మెంట్ మౌనంగా రోదిస్తుందని, అందుకే ‘అర్రైవ్ – అలైవ్’ అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఒక ఉద్యమంలా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల శాతం సున్నాకు చేరుకోవాలన్నదే తమ లక్ష్యమని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామ ప్రజలు రోడ్డు భద్రత పాటించాలని కాజీపేట ఎసిపి ప్రతిజ్ఞ చేపించారు.
కార్యక్రమంలో కమలాపూర్ సీ.ఐ. నవీన్, ఎస్ఐలు మధు, దిలీప్, గ్రామ సర్పంచ్ రమ నాగరాజు, ఉపసర్పంచ్ మేడిపల్లి సిద్ధార్థ, వార్డు మెంబర్లు, పెద్ద సంఖ్యలో యువత, మహిళలు ,పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
