Hyderabad child acid attack
* నాలుగేళ్ల చిన్నారికి యాసిడ్ తాగించిన పిన్ని!
ఆకేరు న్యూస్ మేడిపల్లి (హైదరాబాద్): రక్తసంబంధం తలవంచుకునేలా, మానవత్వం మంటగలిసేలా ఓ మహిళ అత్యంత దారుణానికి ఒడిగట్టింది. తన పిల్లల కంటే తోటికోడలి కుమారుడిపై మామగారు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడన్న అసూయతో.. కళ్లుగప్పి ఆ పసివాడికి జ్యూస్ అని చెప్పి యాసిడ్ తాగించింది. హైదరాబాద్లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది.
*ఆస్థి గొడవలే కారణమా* ?
పోలీసుల కథనం ప్రకారం.. మేడిపల్లికి చెందిన నాగరాజు, సంధ్య దంపతులకు నాలుగేళ్ల కుమారుడు కార్తీక్ ఉన్నాడు. నాగరాజు సోదరుడి భార్య మంజులకు, సంధ్య కుటుంబానికి మధ్య ఆస్తి విషయాల్లో లేదా కుటుంబ పరంగా కొన్ని విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రధానంగా మామగారు (తాతయ్య) కార్తీక్ పట్ల అమితమైన ప్రేమను ప్రదర్శించడం మంజులకు నచ్చలేదు. తన పిల్లల కంటే కార్తీక్ కే ఇంట్లో ప్రాధాన్యత దక్కుతోందని ఆమె మనస్తాపానికి గురైంది.
*జ్యూస్ అని నమ్మించి ఘాతుకం*
ఈ క్రమంలోనే చిన్నారి కార్తీక్ను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసిన మంజుల, ఎవరూ లేని సమయం చూసి బాలుడి వద్దకు వెళ్ళింది. అది తాగే జ్యూస్ అని చెప్పి బలవంతంగా కార్తీక్ నోటిలో యాసిడ్ పోసింది. అది తాగిన వెంటనే బాలుడు కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. చిన్నారి పరిస్థితిని గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు.
*గతంలో కూడా హత్యాయత్నం*
ఈ ఘటనపై కార్తీక్ తల్లి సంధ్య మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంజుల ఉద్దేశపూర్వకంగానే తన కుమారుడిని చంపాలని చూసిందని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా, గతంలో కూడా తన కొడుకుపై మంజుల హత్యాయత్నానికి పాల్పడిందని ఆమె ఫిర్యాదులో పేర్కొనడం కలకలం రేపుతోంది.
* కేసు నమోదు.. దర్యాప్తు
బాధితుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు నిందితురాలు మంజులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కేవలం అసూయతో పసివాడి ప్రాణాలు తీయాలని చూడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
