KAVITHA TRS party EC approval
* ఇక నుంచి తెలంగాణ రక్షణ సేన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కవిత ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సేనకు బదులుగా తెలంగాణ రక్షణ సేనకు ఆమోదం తెలిపింది. గురువారం బంజారా హిల్స్‌లోని కవిత ఇంటికి ఎన్నికల సంఘం అధికారులు వెళ్ళి ఆమోదానికి సంబందించిన పత్రాలను అందజేశారు. కాగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి అంటే టీఆర్ఎస్ పేరుతో 2001 లో పార్టీని ఏర్పాటు చేశారు. జాతీయ రాజకీయాలకు వెళ్ళాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (TRS ) ని 2022 అక్టోబర్ 5 న భారత రాష్ట్ర సమితి ( BRS ) గా మార్చారు. రాష్ట్ర రాజకీయాల్లోనే నిలవ లేక పోవడం వల్ల జాతీయ రాజకీయాల్లోకి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళ లేక పోయింది. కేడర్‌తో పాటు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ అనే పరుతో భావోద్వేగ బంధంతో ఉంటారని పార్టీ మార్చాలని కేసీఆర్ కు చాలా మంది నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన వినకుండా బీఆర్ఎస్ పార్టీగానే కొనసాగుతున్నారు. ఈ మద్య కాలంలో కేటీఆర్ ఒక సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ పేరును టీఆర్ఎస్ పార్టీగా మార్చేందుకు ఆలోచిస్తున్నామని అన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ అని వచ్చేటట్లు పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీకీ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం కూడా తెలిపింది.
* బీఆర్ఎస్ ఇక టీఆర్ఎస్గా మారే అవకాశం లేదు
బీఆర్ఎస్ పార్టీ వల్ల జాతీయ రాజకీయాల్లో రాణించడం మాట అటుంచి తెలంగాణలోనే ఘోర పరాజయం పొందారు. దీంతో బీఆర్ఎస్ పార్టీని తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలని పార్టీ కేడర్ , నాయకులు , ఇతర ఉద్యమ సంస్థలు కూడా బీఆర్ఎస్ అధినాయకులకు సూచించినట్లు సమాచారం. గతంలో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పేరు మార్చేది లేదని భీష్మించిన కేసీఆర్ ఒక దశలో సరే చూద్దాం అన్న దశకు వచ్చినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇపుడు కవిత టీఆర్ఎస్ పార్టీ పేరుతో ప్రజల్లోకి వెళ్ళడానికి పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ దశలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా మారే అవకాశం లేకుండా పోయింది. ఇక బీఆర్ఎస్ పేరుతోనే ప్రజల్లోకి మరింత బలంగా వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
———————-
