Kadiyam Srihari comments on Kalvakuntla family
* మీరు చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా
* కవిత ఎందుకు పార్టీ విడిచిందో చెప్పుకోలేని దుస్థితిలో బిఆర్ఎస్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
పదేళ్ల తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం వందల ఎకరాలు, కోట్లాది రూపాయలు దోచుకుంది.. దాచుకుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం మీదికొండలో శుక్రవారం సిసి రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టలో పాల్గొని కాటమయ్య గుడి వద్ద అభివృద్ధి పనులు ప్రారంభించారు.
అనంతరం సర్పంచ్ జోగు సంపత్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ ఒక్క కల్వకుంట్ల కుటుంబం అధికారంలోకి రావడానికి, అవినీతి అక్రమాలతో వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకోవడానికే ఉపయోగపడిందని ఆరోపించారు. కేసీఆర్ స్వంత బిడ్డే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు అవినీతి చేశారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేశారని విమర్శలు చేస్తోందని అన్నారు. మీరు నిజంగా నీతి మంతులు, నిజాయితీపరులు అయితే కేసీఆర్ బిడ్డ కవిత చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు కవిత బిఆర్ఎస్ నుండి ఎందుకు బయటకు వెళ్లిందో చెప్పుకోలేని దుస్థితిలో కల్వకుంట్ల కుటుంబం ఉందని ఏద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది మీరే కదా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. అంటే నువ్వు చేస్తే సంసారం… వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా అని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చందుకు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేయడం వల్లేనని స్పష్టం చేశారు. ఎవరన్ని విమర్శలు చేసిన నాకున్న ఏకైక లక్ష్యం, ఎజెండా నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం, పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడం మాత్రమే అని తెలిపారు. గత 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి చిల్లర పనులు, చిల్లర చేష్టలతో, అవినీతి, అక్రమాలతో నియోజకవర్గ ప్రజలు సిగ్గు పడాల్సిన పరిస్థితి తెచ్చారని విమర్శించారు. ఏనాడూ అభివృద్ధిని పట్టించుకోలేదని తాగుడు, తినుడు తప్ప చేసింది ఏమి లేదని అన్నారు. 25 ఏళ్ల కింద నేను వేసిన రోడ్డుకు మళ్ళీ నేనే మారమ్మత్తులు చేయాల్సి వచ్చిందన్నారు. నేను తప్పుడు పనులు చేయను, తలవంపులు తీసుకురానని హామీ ఇచ్చారు. 32 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క రూపాయి అవినీతి చేసినట్లు నిరూపించినా ఇక్కడే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. గొడవలు విమర్శలతో జరిగేది ఏమి ఉండదని గ్రామాల అభివృద్ధికి అందరు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
మీదికొండలో 35 ఇందిరమ్మ ఇండ్లకు కోటి 75లక్షలు, ఎంపీ నిధుల ద్వారా యాదవ, పద్మశాలి కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి 20 లక్షలు, 60 లక్షల సిసి రోడ్లు మొత్తంగాఈ రెండు సంవత్సరాల కాలంలో 2 కోట్ల 50లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. గోవర్ధనగిరి నుండి చిల్పూర్ వరకు 15 కోట్లతో రోడ్డు మంజూరు అయిందని త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయాని తెలిపారు. మీదికొండ గ్రామానికి గోదావరి జలాలు తీసుకువచ్చేందుకు గండి రామారం ద్వారా కాలువలకు మారమ్మత్తులు చేయడం ద్వారా నేడు ఎండా కాలంలో కూడా మీదికొండ ఉత్తరాయని చెరువు మత్తడి పోస్తుందని వెల్లడించారు. రెండవ విడత ఇందిరమ్మ ఇల్లాలో మీదికొండ గ్రామానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. పేద ప్రజల స్వంత ఇంటి కళను కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాకారం చేశారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణి, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, సన్నాలకు బోనస్, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి చేరుతున్నాయని వెల్లడించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 8 లక్షల కోట్ల అప్పుకు ప్రతీ నెల 7 వేల కోట్ల మిత్తిలు చెల్లీస్తూ కూడా పేద ప్రజల సంక్షేమ పథకాలను ఆపకుండా అమలు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు తెల్ల రేషన్ కార్డు ఉన్న కోటి 10 లక్షల కుటుంబాలకు ఇందిరా కుటుంబ భీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా కుటుంబ పెద్ద చనిపోతే 15 రోజులలో 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, ఉపసర్పంచ్ ఆలకుంట శ్రీనివాస్, నాయకులు నాగరబోయిన శ్రీరాములు, నాగరబోయిన యాదగిరి, బుర్ల శంకర్ మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
