Internal Committees Set Up to address workplace harassment
* మహిళా ఉద్యోగుల భద్రతకు ఇంటర్నల్ కమిటీలు
* SHe-Box Portalలో ఈ-రిజిస్ట్రేషన్
* పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లోనూ ఏర్పాటు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
పని ప్రదేశంలో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నుంచి రక్షణకు వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు సురక్షితమైన, గౌరవప్రదమైన, వేధింపుల రహిత కార్యాలయ వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. పుట్ల శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు అండగా ఉండేలా చర్యలు చేపట్టామన్నారు.
* 91 కేంద్రాల్లో..
మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 91 ఇంటర్నల్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్ ఓ తెలిపారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, యాక్షన్ ఎయిడ్ అసోసియేషన్ సహకారంతో ఈ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పని ప్రదేశంలో వేధింపులను ఎదుర్కొన్న ఎవరైనా అధికారిక వెబ్సైట్ ద్వారా నేరుగా తమ ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చునని సూచించారు.
* ఈ-రిజిస్ట్రేషన్
ఇంటర్నల్ కమిటీలను తెలంగాణ షీ-బాక్స్ పోర్టల్లో ఈ-రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత నోడల్ అధికారులకు, ఇంటర్నల్ కమిటీ సభ్యులకు ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార ప్రక్రియపై మార్గదర్శకాలు, సాంకేతిక సహాయం అందించినట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళా ఉద్యోగుల భద్రతతో పాటు వారి ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించే వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో మహిళలకు అనుకూలమైన, సమానత్వంతో కూడిన సురక్షితమైన పని వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఈ సమన్వయ కార్యక్రమం దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ-రిజిస్ట్రేషన్, ఫిర్యాదుల కోసం సందర్శించాల్సిన అధికారిక వెబ్సైట్ ఇదే.. https://shebox.wcd.gov.in/

Please tell us what is wrong. Your report will be sent to the website team.
