Paddy Procurement Livestock Welfare
* పశు సంపద గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
పశు సంపద గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటిదని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం కొత్తపల్లిలో పశు ఆరోగ్య, సంతానోత్పత్తి శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించి, దూడలు, గొర్రెలు, మేకలకు నులిపురుగుల నివారణ మందులు వేయించారు. అనంతరం ఖనిజ మిశ్రమాన్ని రైతులకు పంపిణీ చేశారు. పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించారు. ఇందులో మొత్తం 85 పశువులకు గాను వైద్య సేవలు అందించగా, 40 మంది రైతులు పాల్గొని ఈ సేవలను సద్వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ పశుసంవర్ధక రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటిదని అన్నారు.
పశువుల ఆరోగ్యం బాగుంటేనే రైతుకు ఆర్థికంగా లాభం చేకూరుతుందన్నారు. రైతులు పశువులకు సమయానికి టీకాలు వేయించడం, పోషకాహారం అందించడం, పరిశుభ్రత పాటించడం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పశువుల్లో వ్యాధుల లక్షణాలు కనిపించిన వెంటనే సమీప పశు వైద్య అధికారులను సంప్రదించాలని కోరారు. అలాగే సంతానోత్పత్తి సేవలను సద్వినియోగం చేసుకొని, పాల ఉత్పత్తి, పశు సంపదను పెంచుకోవాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం పశుసంవర్ధక రంగ అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, రైతులు వాటిని పూర్తిగా వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా రైతులకు పశుసంవర్ధక రంగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పశువుల ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారి మురళీధర్ రావు, ఏడీలు, ఏవీహెచ్ ఘన్పూర్ (స్టేషన్), తిమ్మంపేట, జనగామ, ఎంఏహెచ్ఓ ఘన్పూర్ (స్టేషన్), వీఏఎస్ మల్కాపూర్, పారావెట్స్, గోపాలమిత్రలు, తదితరులు పాల్గొన్నారు.
* ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నిర్వాహకులకు సూచించారు. జనగా జిల్లా చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల పరిధిలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ, వడ్ల నాణ్యత, తేమ శాతం పరీక్షలు, బస్తాల నిల్వలు, హమాలీల సేవలు, రవాణా ఏర్పాట్లు, ట్రక్ షీట్, కాంటాలు, తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే రైతులకు కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలపై ఆరా తీశారు. రైతుల నుంచి ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేసి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎండల దృష్ట్యా రైతులకు తాగునీరు, నీడ వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని నాణ్యతా ప్రమాణాల ప్రకారం త్వరితగతిన కొనుగోలు చేసి, ఎటువంటి ఆలస్యం లేకుండా మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. లారీల ద్వారా ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్ ప్రక్రియ సకాలంలో చేపట్టాలని, లారీలలో ధాన్యం బస్తాలను వేగంగా నింపి, ఓ వ్యక్తి లారీతో పాటు సంబంధిత మిల్లులకు వెళ్లి, అక్కడ అన్ లోడింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
