* తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు
* రోడ్లపై బోల్తా పడ్డ లారీ, ఆటో, ట్రాక్టర్..
* వేర్వేరు ప్రాంతాల్లో 12 మంది మృతి
* కృష్ణాజిల్లాలో జరిగిన ప్రమాదంలోనే ఆరుగురు..
తెల్లవారుతుండగానే రోడ్డు ప్రమాదాలు టెర్రర్ పుట్టించాయి. కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన నాలుగు ప్రమాదాల్లో 12 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
హైవేపై రెండు లారీలు ఢీకొని..
ఆకేరు న్యూస్ డెస్క్ : కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద హైవేపై రెండు లారీలు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు.. మృతుల్లో లారీల డ్రైవర్లతో పాటు మరో నలుగురు ఉన్నారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు అక్కడిక్కడే చనిపోగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు వస్తున్న లారీ.. పుదుచ్చేరి నుంచి భీమవరం వైపు మరో లారీని డీకొట్టింది. ప్రమాద సమయంలో కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు వెళ్తున్న లారీలో డ్రైవర్‌తో పాటు 10 మంది ప్రయాణికులున్నట్లు చెబుతున్నారు. మరో లారీలో డ్రైవర్‌తో పాటు ఓ ప్రయాణికుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.. రోడ్డుపై ట్రాఫిక్ క్లియర్ చేశారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో..
మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మహబూబాబాద్ నుంచి వరంగల్ వైపు కట్టెలలోడుతో వెళుతున్న లారీ గూడూరు మండలం కేంద్రం వద్ద బోల్తా పడింది. మూలమలుపు తిరుగుతుండగా ఒక్కసారిగా బోల్తాపడటటంతో లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. అధిక వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. దీంతో పాటు అధిక లోడు కూడా ఉందని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాపట్ల జిల్లాలో భార్యాభర్తలు..
బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో జరిగిన మరో ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. పల్నాడు జిల్లా రొంపిచర్ల గ్రామం సుబ్బారెడ్డి కాలనీకి చెందిన బత్తుల కొండలు (49), లక్ష్మి (41) దంపతులు తమ పెద్ద కుమార్తె గ్రామం ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామంలో జరుగుతున్న దేవుడి కొలుపులకు వెళ్లారు. తిరిగి ద్విచక్రవాహనంలో ఇంటికి వస్తుండగా బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో రాంగ్రూట్లో వస్తున్న లారీ ఈ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మరణించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెంలో…
భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. పాల్వంచ వద్ద ట్రాక్టర్ బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే.. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందారు. ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
———————