Supreme Court Caste Census
ఆకేరు న్యూస్, డెస్క్: దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన కులగణన (Caste Census) అంశంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలక తీర్పును వెలువరించింది. జనగణనలో భాగంగా కులగణన చేపట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం పూర్తిగా కొట్టివేసింది. కులగణన నిర్వహణ అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
*సమగ్ర అభివృద్ధికే కులగణన..
సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరగాలన్నా, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి సరైన ప్రణాళికలు రూపొందించాలన్నా వారి ఖచ్చితమైన జనాభా వివరాలు అవసరమని కోర్టు అభిప్రాయపడింది. “వెనుకబడిన కులాల జనాభా ఎంతో తెలిస్తేనే దేశంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. సమాజంలో ఏయే వర్గాలు వెనుకబడి ఉన్నాయో గుర్తించే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉంది” అని ధర్మాసనం స్పష్టం చేసింది.
*ప్రభుత్వ పాలసీలో జోక్యం చేసుకోం..
కులగణన అనేది ప్రభుత్వ పరిధిలోని పాలసీ (విధానపరమైన) నిర్ణయమని సుప్రీంకోర్టు పేర్కొంది. “ఇది పూర్తిగా ప్రభుత్వ పరిధిలోని అంశం. ప్రభుత్వాలు తీసుకునే ఇటువంటి సామాజిక సంక్షేమ, విధానపరమైన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు” అని స్పష్టం చేస్తూ, కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది.
*రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యత..
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు తమ పరిధిలో కులగణన దిశగా అడుగులు వేస్తుండగా, తాజా తీర్పుతో ప్రభుత్వాల నిర్ణయాలకు మరింత న్యాయపరమైన బలం చేకూరినట్లయింది. ఈ తీర్పు దేశ సామాజిక, రాజకీయ ముఖచిత్రంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
