Telangana Cabinet Key Decisions
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో నేడు (మే 23) సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి (కేబినెట్) కీలక సమావేశం జరగనుంది. జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లతో పాటు, రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు, ప్రభుత్వ శాఖల్లో పొదుపు చర్యలు, సంక్షేమ పథకాల అమలుపై ఈ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
*’రైతు డిస్కం’…
రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న డిస్కంలను గట్టెక్కించేందుకు ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతోంది.
వ్యవసాయం, ఎత్తిపోతల పథకాలు, తాగునీటి సరఫరా కనెక్షన్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన “తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ” (రైతు డిస్కం) జూన్ 2వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. దీనికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీంతో పాటు వ్యవసాయ పంప్సెట్లకు ఇచ్చే ప్రోత్సాహకాలపై కూడా చర్చ జరగనుంది.
*సోలార్ విలేజెస్..
గ్రీన్ ఎనర్జీ (హరిత ఇంధనం) వైపు రాష్ట్రాన్ని నడిపించేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేసింది. కొండారెడ్డిపల్లి తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని గ్రామాలను ‘సోలార్ విలేజెస్’ గా మార్చాలని కేబినెట్ నిర్ణయించనుంది. గ్రామీణ మహిళల కోసం ప్రత్యేకంగా ‘సోలార్ స్టౌ స్కీమ్’ (సౌర పొయ్యి పథకం) అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
*ప్రభుత్వ శాఖల్లో పొదుపు చర్యలు…
ఆర్థిక క్రమశిక్షణ, ఇంధన పొదుపు ధ్యేయంగా ప్రభుత్వ శాఖల్లో కీలక మార్పులు చేయబోతున్నారు.
అన్ని ప్రభుత్వ శాఖల్లో పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గించి, వాటి స్థానంలో ఈవీల (ఎలక్ట్రిక్ వాహనాల) వినియోగాన్ని తప్పనిసరి చేయడంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ ఆదా చర్యలపై విధివిధానాలను ఖరారు చేయనున్నారు.
*సంక్షేమ పథకాలు…
పేదలు, రైతుల కోసం ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీల అమలుపై కేబినెట్ దృష్టి సారించింది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన నిధులు, కార్యాచరణపై చర్చించనున్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం విధివిధానాలను ఖరారు చేయనున్నారు. వ్యవసాయ రంగంలో లాభసాటి పంటల వైపు రైతులను మళ్లించేందుకు ‘పంటల మార్పిడి యాక్షన్ ప్లాన్’ను కేబినెట్ ఆమోదించనుంది.
*జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ వేడుకలు…
మరో వారంలో రానున్న జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకల నిర్వహణతో పాటు ప్రజలకు ప్రకటించబోయే కొత్త కానుకలపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
