CM Revanth Reddy ORR Industries
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) అంతర్భాగ ప్రాంతాన్ని పూర్తిగా కాలుష్య రహిత జోన్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో ప్రసిద్ధ ‘ప్రీమియర్ ఎనర్జీస్’ సంస్థ నెలకొల్పిన 5.6 గిగావాట్ల సామర్థ్యం గల భారీ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి సీఎం గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ రూపొందించిన మొట్టమొదటి ‘సోలార్ ఆక్సీ ట్రీ’ (సోలార్ పవర్డ్ స్ట్రీట్ లైట్ ఎయిర్ క్లీనింగ్ సిస్టమ్) తో పాటు వివిధ సోలార్ ఉత్పత్తులను సీఎం పరిశీలించారు.

* ఢిల్లీ, ముంబై నుంచి పాఠాలు నేర్చుకోవాలి..
అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ప్రస్తుతం తీవ్రమైన కాలుష్య, మౌలిక సదుపాయాల సమస్యలను ఎదుర్కొంటున్నాయని గుర్తుచేశారు. ఆయా నగరాల పరిస్థితుల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలోని జీడిమెట్ల, బాలానగర్ వంటి పారిశ్రామిక ప్రాంతాల కాలుష్యం, మూసీ నది కాలుష్యం వల్ల నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
* ORR అవతలికి పరిశ్రమల తరలింపు..
2,100 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఓఆర్ఆర్ లోపలి కోర్ అర్బన్ ఏరియాలో దాదాపు 1 కోటి 35 లక్షల జనాభా అవసరాలకు అనుగుణంగా నగరాన్ని డెవలప్ చేస్తామని సీఎం ప్రకటించారు. ఇందులో భాగంగానే పరిశ్రమలను ORR బయటకు తరలించడానికి చట్టం తెచ్చామని వెల్లడించారు.
“ORR వెలుపల ఉన్న ‘పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ’ ప్రాంతాన్ని మాన్యుఫాక్చరింగ్ జోన్‌గా గుర్తించాం. నగరం నుంచి తరలించే పరిశ్రమలకు అక్కడే స్థలాలు కేటాయిస్తాం. ఈ జోన్లో కేవలం 12 నెలల రికార్డు కాలంలోనే యూనిట్‌ను ఏర్పాటు చేసిన ప్రీమియర్ ఎనర్జీస్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను” అని సీఎం పేర్కొన్నారు.

* 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ..
తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు ప్రాంతీయ మండళ్లుగా విభజించి ముందుకు వెళ్తున్నామని సీఎం వివరించారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ సంకల్పమన్నారు. గ్లోబల్ సిటీగా మారాలంటే మరిన్ని పెట్టుబడులు రావాలని, ప్రకృతిని కాపాడుకోవడంలో ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం కూడా ఎంతో ముఖ్యమని కోరారు.
* యువతకు బ్లూ కాలర్ ఉద్యోగాలు..
కేవలం వైట్ కాలర్ ఉద్యోగాల పైనే ఆధారపడకుండా, యువత ఉపాధి అవకాశాలు పెంచుకునేలా బ్లూ కాలర్ జాబ్స్ వైపు మొగ్గు చూపాలని సీఎం పిలుపునిచ్చారు. ఇందుకోసం వారిలో నైపుణ్యాలను పెంచేందుకు ఏటీసీలు (ATCs), పాలిటెక్నిక్ కాలేజీలు, స్కిల్స్ యూనివర్సిటీలను ప్రభుత్వం సిద్ధం చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, ప్రీమియర్ ఎనర్జీ చైర్మన్ సురేందర్ పాల్ సింగ్ సలూజా, మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవ్ సింగ్ సలూజా, డైరెక్టర్ సుధీర్ మూల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రేవతి రోహిణి మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
