Governor Shiv Pratap Shukla Nasha Mukth Bharat Rally
ఆకేరు న్యూస్, హనుమకొండ:
మాదకద్రవ్యాల మహమ్మారిని సమాజం నుంచి పూర్తిగా తుడిచిపెట్టేందుకు ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పోరాడాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల నిర్మూలన కేవలం చట్టాలు, పోలీసుల వల్లే సాధ్యం కాదని, అది ఒక ప్రజా ఉద్యమంగా మారినప్పుడే “డ్రగ్స్ రహిత భారత్ – డ్రగ్స్ రహిత తెలంగాణ” సాకారమవుతుందని ఆయన స్పష్టం చేశారు. గురువారం హనుమకొండ జిల్లా సమీకృత కలెక్టరేట్ (ఐడీఓసీ) వేదికగా తెలంగాణ ఎక్సైజ్, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, పోలీస్, మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక “నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

* ఘన స్వాగతం.. సంతకాల సేకరణతో ప్రారంభం…
హనుమకొండ కలెక్టరేట్‌కు చేరుకున్న గవర్నర్‌కు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. అనంతరం డ్రగ్స్ వల్ల కలిగే వినాశకర పరిణామాలపై రూపొందించిన ప్రత్యేక అవగాహన పోస్టర్లను గవర్నర్ ఆవిష్కరించారు. మత్తు పదార్థాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహిస్తామనే సంకల్పానికి ప్రతీకగా ఏర్పాటు చేసిన భారీ సంతకాల సేకరణ బోర్డుపై గవర్నర్, మంత్రి, శాసనసభ్యులు సంతకాలు చేసి ప్రచారాన్ని వేగవంతం చేశారు.
* మార్పు మన ఇల్లే పునాది – గవర్నర్ పిలుపు…
సముచిత వేదికపై విద్యార్థులు, యువత, అధికార యంత్రాంగంతో “నషా ముక్త్ భారత్” ప్రతిజ్ఞ చేయించిన అనంతరం గవర్నర్ సభాముఖంగా ప్రసంగించారు.
“భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప్రారంభించిన నషా ముక్త్ భారత్ అభియాన్ కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు.. అది ఒక సామాజిక చైతన్య ఉద్యమం. ‘మా ఇంట్లో మత్తుకు చోటు లేదు’ అనే దృఢ సంకల్పం ప్రతి కుటుంబంలో రావాలి. మార్పు ఎప్పుడూ మన నుంచే మొదలవ్వాలి,” అని ఆయన వ్యాఖ్యానించారు.
యువతను డ్రగ్స్ వైపు వెళ్లకుండా అడ్డుకోవడానికి క్రీడలు ఒక అద్భుతమైన మార్గమని గవర్నర్ సూచించారు. “ఆటలు ఆడించండి… మత్తును పారదోలండి” అనే నినాదాన్ని తాము హిమాచల్ ప్రదేశ్‌లో విజయవంతంగా అమలు చేసి ఆశించిన ఫలితాలు సాధించామని, అదే స్ఫూర్తిని ఇక్కడ కూడా కొనసాగించాలని కోరారు. డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం చొరవ చూపుతున్న ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా గవర్నర్ అభినందించారు.

* సీఎం రేవంత్ సారథ్యంలో ప్రత్యేక కార్యాచరణ- మంత్రి అడ్లూరి…
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా, తెలంగాణలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో డ్రగ్స్ రహిత రాష్ట్ర ఏర్పాటుకు అత్యంత కఠినమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి యువతను కాపాడుకోవాలని కోరారు. హనుమకొండలో జరిగిన ఈ కార్యక్రమానికి గవర్నర్ విచ్చేసి దిశానిర్దేశం చేయడం తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ ఉద్యమానికి కొండంత బలాన్ని ఇచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
* ఆర్ట్స్ కాలేజీ వరకు ఉరకలెత్తిన అవగాహన ర్యాలీ…
కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణం నుండి హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం వరకు వేలాది మంది విద్యార్థులు, పౌరులు, పోలీసులతో నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. “డ్రగ్స్ వద్దు.. జీవనమే ముద్దు” అంటూ విద్యార్థులు చేసిన నినాదాలు హనుమకొండ పురవీధుల్లో మారుమోగాయి.

* తరలివచ్చిన ప్రముఖులు, ఉన్నతాధికారులు…
ఈ మహా సంకల్ప కార్యక్రమంలో రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్ పాల్గొన్నారు. అలాగే వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న, అదనపు కలెక్టర్లు రవి, సంధ్యారాణి, వై.వి. గణేష్, డీసీపీ ధార కవితతో పాటు పలువురు జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ సదస్సును విజయవంతం చేయడంలో భాగస్వాములయ్యారు.
