Medchal Deputy Collector Vamsi Mohan ACB Raids
* 11 చోట్ల ఏసీబీ మెరుపు దాడులు
ఆకేరు న్యూస్, మేడ్చల్: తెలంగాణ రెవెన్యూ శాఖలో మరో భారీ అవినీతి తిమింగలం యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులకు చిక్కింది. అధికార బలంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ, వివాదాస్పద భూములను కొల్లగొట్టి, అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ ఎమ్. వంశీమోహన్‌ను ఏసీబీ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. ఆయనకు చెందిన ఇళ్లు, కార్యాలయాలు, మరియు బంధువుల నివాసాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించిన అధికారులు, షాకింగ్ నిజాలను వెలికితీశారు. వంశీమోహన్ కూడబెట్టిన మొత్తం అక్రమ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
* బంధువులతో కలిసి రియల్ ఎస్టేట్ దందా…
డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ తన అధికారిక హోదాను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున భూ దందాలకు పాల్పడినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని అత్యంత విలువైన వివాదాస్పద భూములు, ప్రభుత్వ భూములను ఆయన టార్గెట్ చేశారు. వివాదాల్లో ఉన్న భూములను తన అధికార పరిధిని ఉపయోగించి క్లియర్ చేయడం లేదా రికార్డులను మార్చడం వంటి అక్రమాలకు పాల్పడ్డారు. నేరుగా తన పేరు మీద కాకుండా, తన అత్యంత ఆప్తులు, బంధువుల పేర్లతో ఆయా భూములను కబ్జా చేసి, ప్రైవేట్ వ్యక్తులతో కలిసి పెద్ద పెద్ద లేఅవుట్లుగా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించినట్లు బలమైన ఆధారాలు లభించాయి.
* 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు…
విశ్వసనీయ సమాచారం మరియు బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. హైదరాబాద్‌లోని వంశీమోహన్ ప్రధాన నివాసంతో పాటు, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని ఆయన బంధువులు, వ్యాపార భాగస్వాములకు చెందిన మొత్తం 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన ఈ దాడుల్లో భారీగా ఆస్తుల పత్రాలు, నగదు పట్టుబడ్డాయి. ఈ సోదాల్లో లభించిన డాక్యుమెంట్ల ప్రకారం స్థిర, చర ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ.6.22 కోట్లుగా తేలింది. అయితే, ప్రస్తుత బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం వీటి అసలు విలువ వంద కోట్ల రూపాయలను దాటుతుందని అధికారులు స్పష్టం చేశారు.
* తదుపరి చర్యల& విచారణ తీవ్రం…
ఏసీబీ జరిపిన ఈ సోదాల్లో లభించిన రూ.6.22 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఆదాయ వనరులకు మించి ఆస్తులు సంపాదించినట్లు (Disproportionate Assets) కేసు నమోదు చేసి ఆయనను రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అవినీతి నెట్‌వర్క్‌లో ఇంకా ఎంతమంది రెవెన్యూ అధికారులు, రియల్టర్లు ఉన్నారనే కోణంలో ఏసీబీ లోతుగా విచారణ జరుపుతోంది. రాబోయే రోజుల్లో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
