Uppal Railway Over Bridge Damage
* నాణ్యత లోపమా ?
* అధిక లోడ్ లారీల ప్రభావమా ?
* అధికారులు చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హుజరాబాద్ – పరకాల ప్రధాన రహదారిపై ఉప్పల్ రైల్వే గేట్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి రూ. 66 కోట్ల భారీ వ్యయంతో నిర్మాణం జరిగింది. ఈ ఆర్ఓబీ పై పూర్తిస్థాయిలో రాకపోకలు ప్రారంభమై ఐదు నెలలు కూడా గడవకముందే దెబ్బతినడం చర్చనీయాంశంగా మారింది. పరకాల నుంచి హుజరాబాద్ వెళ్లే మార్గంలో బ్రిడ్జిపై నుంచి ఆర్ఓబీకి అనుసంధానించిన నిర్మాణం పాక్షికంగా దెబ్బతిని, నిర్మాణం కోసం లోపల వాడిన ఇనుప రాడ్లు బయటకు కనిపిస్తున్నాయి. ఇంత త్వరగా దెబ్బతినడంతో దీని నిర్మాణ నాణ్యతపై ప్రయాణికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ మార్గంలో నిబంధనలకు విరుద్ధంగా, పరిమితికి మించిన లోడ్‌తో వెళ్తున్న భారీ బొగ్గు, గ్రానైట్ లారీల వల్లే ఆర్ఓబీ నిర్మాణం ఇంతలా దెబ్బతింటుందని ప్రజలు బలంగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, తక్షణ మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
