Child Safety Awareness Tips
*పిల్లల రక్షణపై డాక్టర్ ప్రశాంతి హెచ్చరిక
ఆకేరు న్యూస్, హన్మకొండ: ప్రస్తుత సమాజంలో రోజురోజుకూ చిన్న పిల్లలపై, ముఖ్యంగా ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపుల ఉదంతాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బయటి వ్యక్తుల కంటే సొంత మనుషులు, నమ్మకస్థుల నుంచే పిల్లలకు ముప్పు ఎక్కువగా పొంచి ఉందనే చేదు నిజాన్ని హనుమకొండకు చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ప్రశాంతి బట్టబయలు చేశారు. పిల్లల రక్షణ విషయంలో తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు వహించాల్సిన పాత్రపై ఆమె అత్యంత కీలకమైన, సంచలన విషయాలను పంచుకున్నారు.
*సొంత మనుషులే కదా అని నమ్మకండి…
సమాజంలో జరుగుతున్న అనేక ఘటనలను విశ్లేషిస్తూ.. పిల్లలపై జరిగే లైంగిక వేధింపులలో సింహభాగం సమీప బంధువులు, కుటుంబ సభ్యులు లేదా నిత్యం ఇంట్లో తిరిగే నమ్మకస్థుల ద్వారానే జరుగుతున్నాయని డాక్టర్ ప్రశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. “మన రక్తసంబంధీకులే కదా, సమాజంలో ఎంతో గౌరవప్రదమైన హోదాలో ఉన్నవారే కదా అని ఎవరినీ పిల్లల విషయంలో బ్లైండ్‌గా (గుడ్డిగా) నమ్మకూడదు” అని ఆమె స్పష్టం చేశారు. చుట్టరికం ఉందనో, పెద్ద మనుషులనో నమ్మి పిల్లలను వారి వద్ద ఒంటరిగా వదిలేయడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.
*పిల్లలపై ‘సైలెంట్ నిఘా’ అవసరం…
పిల్లలు ఇంట్లో ఉన్నా, బంధువుల ఇళ్లకు వెళ్లినా వారి చుట్టూ ఉన్న వాతావరణాన్ని తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ ఉండాలి. బంధువులు పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి కదలికలు ఎలా ఉన్నాయి అనే విషయాలపై అత్యంత జాగ్రత్తగా, ‘సైలెంట్’గా నిఘా ఉంచాలని ఆమె సూచించారు. ఏమాత్రం అనుమానాస్పదంగా అనిపించినా తక్షణమే అలర్ట్ అవ్వాలని పిలుపునిచ్చారు.
*తల్లులారా.. స్కూల్ వయసు నుంచే ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ నేర్పండి…
పిల్లల రక్షణలో తల్లుల పాత్ర అత్యంత కీలకమని డాక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. పిల్లలు స్కూలుకు వెళ్లే వయసు నుంచే వారికి ఏది మంచి స్పర్శ (Good Touch), ఏది చెడు స్పర్శ (Bad Touch) అనే విషయాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలి. శరీరంలో ఏయే భాగాలను ఇతరులు తాకకూడదో, ఎవరైనా తప్పుగా తాకినప్పుడు ఎలా స్పందించాలో తల్లులే స్వయంగా పిల్లలకు నేర్పించాలని ఆమె స్పష్టం చేశారు.
*పిల్లల్లో భయం పోగొట్టి.. భరోసా ఇవ్వండి…
చాలా సందర్భాల్లో పిల్లలు తమకు జరిగిన అన్యాయాన్ని భయంతోనో, సిగ్గుతోనో దాచేస్తుంటారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వక వాతావరణాన్ని అలవర్చుకోవాలి. “ఎవరైనా మీ పట్ల తప్పుగా ప్రవర్తిస్తే, బెదిరిస్తే అస్సలు భయపడకండి.. నేరుగా వచ్చి మాకు చెప్పండి” అనే బలమైన నమ్మకాన్ని, భరోసాని పిల్లల్లో నింపాలి. పిల్లల ప్రవర్తనలో ఏ చిన్న అసాధారణ మార్పు కనిపించినా, వారు భయపడుతున్నా తల్లిదండ్రులు వెంటనే గుర్తించి, ఆ పరిస్థితి నుంచి లేదా ఆ వ్యక్తి నుండి పిల్లలను దూరంగా ఉంచి రక్షించుకోవాలని డాక్టర్ ప్రశాంతి తల్లిదండ్రులకు హితవు పలికారు.
సమాజంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులూ కళ్లు తెరిపించేలా, పిల్లల భద్రతకు దిక్సూచిలా ఉన్న డాక్టర్ ప్రశాంతి గారి ఈ సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

1 thought on “Good Touch Bad Touch | పిల్లలపై ‘సైలెంట్ నిఘా’ అవసరం…”