CM REVANTH REDDY Pranahita Project Big Step
* ఉత్తర తెలంగాణకు గుడ్ న్యూస్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చే అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ‘డా. బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత – చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు’లో భాగంగా ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి (ఉప ముఖ్యమంత్రి) శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఒక అధికారిక లేఖ రాశారు. ఈ అంశంపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారుల, ప్రతినిధి బృందంతో సమావేశం కావాలని, అందుకు అనుకూలమైన తేదీని త్వరగా ఖరారు చేయాలని లేఖలో కోరారు.
* 148 మీటర్ల ఎత్తు సరిపోదు..
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ బ్యారేజ్ ఎత్తును మొదట 152 మీటర్లుగా నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే, ముంపు సమస్యలను అధిగమించేందుకు 2016 ఆగస్టు 23న జరిగిన అంతర్రాష్ట్ర బోర్డు (Inter-State Board) సమావేశంలో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ ఎత్తును 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ (Full Reservoir Level) పరిమితం చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీనికి సంబంధించిన అనుమతులకు సైతం సహకరిస్తామని అప్పట్లో తెలిపింది.
అయితే, ఇటీవల ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని సంకల్పించిన ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు డిజైన్లపై పునఃసమీక్ష నిర్వహించింది. ప్రస్తుతం ప్రతిపాదించిన 148 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో ఉత్తర తెలంగాణలోని సాగునీటి అవసరాలను పూర్తిగా తీర్చడం సాధ్యం కాదని సాగునీటి రంగ నిపుణులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
* గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకే..
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పరిధిలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు, ఆయా ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించాలంటే తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తుపై పునరాలోచన అవసరమని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో మరోసారి చర్చలు జరపడం అత్యంత ఆవశ్యకమని ఆయన తన లేఖలో ప్రస్తావించారు.
లేఖలోని ముఖ్యాంశాలు..
బ్యారేజ్ ఎత్తును 148 మీటర్ల కంటే కొంత మేర పెంచినా, మహారాష్ట్ర వైపు జరిగే ముంపు ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది.
ఎఫ్ఆర్ఎల్ (FRL) స్వల్పంగా పెరగడం వల్ల తెలంగాణకు ఎటువంటి అదనపు పంపింగ్ ఖర్చులు లేకుండా, కేవలం సహజ సిద్ధమైన గ్రావిటీ (గురుత్వాకర్షణ) ద్వారా భారీగా నీటిని తరలించుకునే వీలుంటుంది.
ఉత్తర తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న ప్రాణహిత ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో ఈ అంతర్రాష్ట్ర చర్చలు అత్యంత కీలకంగా మారనున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తే, ఈ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
