Supreme Court New Judges
ఆకేరు న్యూస్, డెస్క్: దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల కొరతను తీర్చే దిశగా ఒక చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొల్లేజియం.. సర్వోన్నత న్యాయస్థానంలో ఖాళీలను భర్తీ చేసేందుకు ఏకకాలంలో ఐదుగురు నూతన న్యాయమూర్తుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మే 22, 27 తేదీల్లో సుదీర్ఘంగా సాగిన కొల్లేజియం సమావేశాల అనంతరం ఈ పేర్లను ఖరారు చేశారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో 32 మంది న్యాయమూర్తులు విధులు నిర్వహిస్తుండగా.. ఈ ఐదుగురి నియామకాలకు కేంద్రం ఆమోదం తెలిపితే, సర్వోన్నత న్యాయస్థానం పూర్తి స్థాయి సామర్థ్యంతో పని చేయనుంది. ఇందులో నలుగురు వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కాగా, ఒకరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కావడం విశేషం.
* కొల్లేజియం సిఫార్సు చేసిన ఐదుగురు ప్రముఖులు వీరే.
జస్టిస్ శీల్ నాగు…
ప్రస్తుతం పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన మాతృ హైకోర్టు మధ్యప్రదేశ్. 2011లో అక్కడ అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించి, ఆ తర్వాత పూర్తిస్థాయి జడ్జిగా పదోన్నతి పొందారు.
* జస్టిస్ శ్రీ చంద్రశేఖర్..
ప్రస్తుతం బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు. జార్ఖండ్ హైకోర్టుకు చెందిన ఈయన, 2013లో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. లాయర్‌గా ఉన్న కాలంలోనే సుప్రీంకోర్టులో ఎన్నో ప్రతిష్టాత్మక కేసులను వాదించారు.
* జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా…
ప్రస్తుతం మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు నుంచి తన న్యాయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఈయన, 2013లో న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
* జస్టిస్ అరుణ్ పల్లి…
ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చూస్తున్నారు. పంజాబ్ మరియు హర్యానా హైకోర్టుకు చెందిన ఈయన 2014లో న్యాయమూర్తిగా నియామకమయ్యారు.
శ్రీమతి వి. మోహన సరికొత్త
* రికార్డు.. న్యాయవాదుల కోటా నుండి నేరుగా సుప్రీంకు..
ఈ ఐదుగురి జాబితాలో అత్యంత ఆసక్తికరమైన మరియు చారిత్రాత్మకమైన పేరు సీనియర్ న్యాయవాది శ్రీమతి వి. మోహన.
రెండు రికార్డులు ఒకేసారి: ఈమె నియామకం ఖరారైతే.. సుప్రీంకోర్టు చరిత్రలో నేరుగా న్యాయవాదుల కోటా నుండి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన అతికొద్ది మంది మహిళల్లో ఒకరిగా నిలుస్తారు. అలాగే సుప్రీంకోర్టు చరిత్రలో 12వ మహిళా న్యాయమూర్తిగా రికార్డు సృష్టిస్తారు. తమిళనాడుకు చెందిన వి. మోహన 1988లో కోయంబత్తూరు లా కాలేజీ నుండి పట్టా పొందారు. మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ న్యాయవాది పి. చిదంబరం వద్ద జూనియర్‌గా లాయర్ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1996లో అత్యున్నత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, సుప్రీంకోర్టులో స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. గతంలో జస్టిస్ ఇందు మల్హోత్రా కూడా ఇదే కోటా నుండి నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు.
* ఒకే విడతలో 9 మంది జడ్జీల రికార్డు ఏంటి
గతంలో 2021 ఆగస్టు 17న అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని కొల్లేజియం ఒకేసారి ఏకంగా తొమ్మిది మంది న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో (ఐదుగురు) జడ్జీలను సిఫార్సు చేయడం మళ్లీ ఇదే ప్రథమం కావడం గమనార్హం.
* సీనియర్ లాయర్ ఎంపిక
దేశంలోని వివిధ ప్రాంతీయ హైకోర్టులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ, పరిపాలనా అనుభవం ఉన్న నలుగురు ప్రధాన న్యాయమూర్తులతో పాటు.. సుప్రీంకోర్టు బార్ నుండి ఒక ప్రతిభావంతమైన మహిళా సీనియర్ లాయర్‌ను ఎంపిక చేయడం ద్వారా కొల్లేజియం అత్యంత సమతుల్యమైన నిర్ణయం తీసుకుందని న్యాయవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల సుప్రీంకోర్టులో పెండింగ్ కేసుల విచారణ మరింత వేగవంతం కానుంది.
