Modi Heatwave Alert India
ఆకేరు న్యూస్, డెస్క్: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. భానుడి భగభగలకు తోడు తీవ్రమైన వడగాల్పులు (Heatwaves) తోడవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ అసాధారణ పరిస్థితులపై స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశంలో నెలకొన్న వేసవి తీవ్రత మరియు ముందస్తు రక్షణ చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎండల సవాలును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగం సంయుక్తంగా రంగంలోకి దిగాలని, పౌరుల ప్రాణరక్షణే ప్రథమ ప్రాధాన్యంగా పనిచేయాలని పీఎం మోదీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
* ‘హోల్-ఆఫ్-ది-నేషన్’ వ్యూహం…
ఎండల తీవ్రత అనేది కేవలం ఒక ప్రాంతానికో లేదా ఒక నిర్దిష్ట విభాగానికో పరిమితమైన సమస్య కాదని, దీనిని జాతీయ విపత్తుగా భావించి వ్యవస్థలన్నీ ఏకతాటిపైకి రావాలని ప్రధాని పేర్కొన్నారు. ఎండల తీవ్రత వంటి ప్రకృతిసిద్ధమైన పెద్ద సవాళ్లను ఎదుర్కొనేటప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక పురపాలక సంస్థలు మరియు పౌరులు అందరూ కలిసికట్టుగా ఒకే తాటిపై పనిచేయాలని స్పష్టం చేశారు. పరస్పర సమన్వయంతో క్షేత్రస్థాయి వ్యూహాలను అమలు చేసినప్పుడే ప్రాణనష్టాన్ని పూర్తిగా నివారించగలమని ఆయన నొక్కిచెప్పారు.
* శాఖల వారీగా తక్షణ కార్యాచరణ…
ముఖ్యంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, జలశక్తి శాఖతో పాటు విపత్తు నిర్వహణ విభాగాలు (NDMA) నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి పెద్ద ఆసుపత్రుల వరకు వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక వార్డులు, అవసరమైన అత్యవసర మందులు, ఐవీ ఫ్లూయిడ్స్ మరియు ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లను తగినంత నిల్వ ఉంచాలని స్పష్టం చేశారు.
* శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచండి….
దేశంలోని విభిన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఎండ మనందరిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోండి. శరీరం నీటి శాతం తగ్గకుండా చూసుకోండి. దాహం వేయకపోయినా తరచుగా నీరు తాగుతూ ఉండండి. అత్యవసర పనులపై బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీటి బాటిల్‌ను వెంట తీసుకెళ్లడం మర్చిపోవద్దని ప్రధాని కోరారు.
* సహాయం& మానవత్వం…
ఈ కఠినమైన వాతావరణంలో ఇతరులకు సహాయం చేయడం ఎంతో ముఖ్యం. ఎండల్లో శ్రమించే కార్మికులకు, నిరుపేదలకు, బయట తిరిగే బాటసారులకు మరియు దారిపోయే వారికి ఒక గ్లాసు మంచి నీరు లేదా మజ్జిగ అందించి సహాయం చేయండి. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటూ మీ వంతుగా చేసే ఇలాంటి చిన్న సహాయం మరొకరి ప్రాణాన్ని రక్షించగలదని మోదీ సందేశమిచ్చారు.
* ఎండ దెబ్బ లక్షణాల పట్ల అప్రమత్తత..
కళ్లు తిరగడం (Dizziness), వికారం (Nausea), విపరీతమైన తలనొప్పి, అలసట లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ఎండ దెబ్బ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరైనా అస్వస్థతకు గురైనా, బలహీనంగా అనిపించినా.. వారిని వెంటనే చల్లని, గాలి ఆడే నీడ ఉన్న ప్రదేశానికి తరలించండి. వారికి తక్షణమే త్రాగడానికి నీరు లేదా ఓఆర్ఎస్ (ORS) ద్రావణం అందేలా చూడాలి. పరిస్థితి తీవ్రంగా ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.
* వృద్ధుల పట్ల ప్రత్యేక జాగ్రత్త…
ఈ హీట్‌వేవ్ సమయంలో వీలైనప్పుడల్లా మీ ఇంట్లోని వృద్ధులైన తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్యలు మరియు ఆత్మీయుల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోండి. వారు నిరంతరం నీరు తాగేలా చూడండి. ముఖ్యంగా ఎండ తీవ్రత గరిష్టంగా ఉండే మధ్యాహ్నం వేళ (ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల మధ్య) వారు బయటకు వెళ్లకుండా, ఇంట్లోనే సురక్షితంగా విశ్రాంతి తీసుకునేలా జాగ్రత్తలు చెప్పాలని ప్రధాని గుర్తుచేశారు.
మూగజీవాల పట్ల కరుణ
ఈ తీవ్రమైన ఎండల్లో మన చుట్టుపక్కల ఉండే పక్షులు, జంతువులను కూడా గుర్తుంచుకుందాం. మీ ఇళ్లు, బాల్కనీలు, టెర్రస్‌లు, దుకాణాలు లేదా ఆఫీసుల వెలుపల ఒక చిన్న గిన్నెలో స్వచ్ఛమైన నీటిని ఉంచండి. అది దాహంతో అల్లాడే పక్షులకు, మూగజీవాలకు ప్రాణదాతగా మారుతుంది. ఈ కష్టకాలంలో అందరం జీవకారుణ్యంతో మసలుకుందామని పీఎం మోదీ పిలుపునిచ్చారు.
