MP Kadiyam Kavya SIR Meeting
ఆకేరు న్యూస్, పరకాల:
దేశంలో బీజేపీ ఓటర్ల జాబితాలతో ప్రమాదకరమైన రాజకీయాలు చేస్తోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన సీనియర్ నాయకులే తమ సొంత నియోజకవర్గాల్లో గెలవలేని విచిత్రమైన పరిస్థితులను బీజేపీ సృష్టిస్తోందని ఆమె మండిపడ్డారు. ఓటర్ల జాబితాల నిర్వహణలో నిర్లక్ష్యం, ఓటు చోరీ వంటి అంశాలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని, ప్రతి ఓటును కాపాడుకునే బాధ్యత బూత్ స్థాయి నాయకులపైనే ఉందని ఆమె స్పష్టం చేశారు.
శుక్రవారం పరకాల పట్టణంలోని ఎన్ఎస్ఆర్ (NSR) కన్వెన్షన్‌లో నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, మహ్మద్ అయూబ్‌లతో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా SIR ప్రక్రియ, ఓటర్ల జాబితా నిర్వహణ, బూత్ స్థాయి బాధ్యతలపై శ్రేణులకు సమగ్ర అవగాహన కల్పించారు.
* అసలు ‘SIR’ ప్రక్రియ అంటే ఏమిటి? దాని ప్రాధాన్యత ఏంటి?
ఎన్నికల నిర్వహణలో, ఓటర్ల జాబితా తయారీలో SIR (Special Intensive Revision – ప్రత్యేక ముమ్మర సవరణ) అనేది అత్యంత కీలకమైన ప్రక్రియ. సాధారణంగా ప్రతి ఏడాది ఓటర్ల జాబితా సవరణ (Summary Revision) జరుగుతుంది. కానీ, ‘SIR’ అనేది అలా కాకుండా చాలా ఏళ్లకు ఒకసారి ఎన్నికల సంఘం చేపట్టే ఒక పకడ్బందీ కార్యక్రమం. ఈ ప్రక్రియలో ఏం జరుగుతుందంటే డోర్ టు డోర్ వెరిఫికేషన్ అధికారులు, బూత్ లెవల్ ఆఫీసర్లు (BLO) ప్రతి ఇంటికీ నేరుగా వెళ్లి ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఒకే ఓటరుకు రెండు మూడు చోట్ల ఓట్లు ఉండటం (Duplicate Votes), చనిపోయిన వారి పేర్లు జాబితాలో కొనసాగడం, ఊరు విడిచి వెళ్లిన వారి వివరాలను తొలగించడం వంటివి చేస్తారు.18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ గుర్తించి కొత్తగా ఓటు హక్కు కల్పిస్తారు. ఇళ్లు మారిన వారి వివరాలను కొత్త నివాస ప్రాంతాల పరిధిలోకి మారుస్తారు. గతంలో 2002లో ఇటువంటి ముమ్మర సవరణ (SIR) ప్రక్రియ జరిగిందని, మళ్లీ 24 ఏళ్ల తర్వాత ఇప్పుడు 2026లో ఈ ప్రక్రియను చేపట్టడం వల్ల దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందని ఎంపీ కడియం కావ్య వివరించారు.
* 2026 ‘SIR’ ప్రక్రియ అత్యంత కీలకం
ఈ సమావేశాన్ని ఉద్దేశించి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.. ప్రతి బూత్ ఏజెంట్ కాంగ్రెస్ పార్టీకి సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.”ప్రజలు తరచూ నివాస ప్రాంతాలు మార్చడం, అద్దె ఇళ్లలో నివసించడం, ఉద్యోగ రీత్యా చిరునామాలు మారడం వల్ల ఓటర్ల జాబితాలో ఖచ్చితత్వం నిలుపుకోవడం సవాల్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ‘SIR’ ప్రక్రియ అత్యంత కీలకం. కాబట్టి పార్టీ నాయకులు, బూత్ ఏజెంట్లు దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి” అని ఆమె సూచించారు.
ప్రతి కుటుంబాన్ని మ్యాపింగ్ చేయడం, కొత్త ఓటర్లను గుర్తించడం, మారిన ఓటర్ల వివరాల సవరణ, అనుమానాస్పద నమోదుల పరిశీలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో SIR పేరుతో ఓటర్ల జాబితాల్లో జరుగుతున్న అక్రమ మార్పులను గమనించాలని, తెలంగాణలో అలాంటి పరిస్థితులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
* ఓటు చోరీపై రాహుల్ గాంధీ పోరాటం
ఓటు చోరీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పోరాడుతున్నారని ఎంపీ గుర్తుచేశారు. “మన ఓటును మనమే కాపాడుకోవాలి. ప్రతి BLA ఒక సైనికుడిలా నిలబడాలి” అని అన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు (BLA), బూత్ లెవల్ ఆఫీసర్లు (BLO) కలిసి వచ్చే మూడు నెలల పాటు విస్తృతంగా డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే కాంగ్రెస్ లక్ష్యమని, ఓటర్ల జాబితానే ఎన్నికల్లో విజయానికి తొలి అడుగు అని స్పష్టం చేశారు.
ఇప్పటికే డివిజన్ల వారీగా ఇన్చార్జిలను నియమించామని, శనివారం నుంచి బూత్ స్థాయి కన్వీనర్లు, ఏజెంట్లు, ముఖ్య నాయకులతో స్థానికంగా సమావేశాలు నిర్వహించి కార్యాచరణను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.
* “BLA హ్యాండ్‌బుక్” ఆవిష్కరణ
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రత్యేకంగా రూపొందించిన “బూత్ లెవల్ ఏజెంట్స్ సంక్షిప్త సమాచారం హ్యాండ్ బుక్”ను నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ హ్యాండ్ బుక్‌లను అక్కడికి వచ్చిన BLAలు, డివిజన్ ఇన్‌చార్జ్‌లకు అందజేశారు. ఈ సదస్సులో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, బూత్ అధ్యక్షులు మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
