TSUTF Opposes EHS Salary Deductions
* ఖండించిన టిఎస్ యుటిఎఫ్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ఉద్యోగుల ఆరోగ్య పథకం విధివిధానాలు ఖరారు కాలేదు.. ఆసుపత్రులతో ఒప్పందం కుదిరింది లేదు.. ప్యాకేజి రేట్లు నిర్ణయించలేదు.. డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వనే లేదు.. ఈహెచ్ఎస్ చందా 1.5% మినహాయింపు పై జిఒ ఇవ్వనే లేదు. కానీ ఆర్థిక శాఖ అత్యుత్సాహంతో ఈహెచ్ఎస్ చందా పేరిట ఉద్యోగుల మే నెల మూల వేతనాల్లో 1.5% కోత విధించటాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాశ్ తీవ్రంగా ఖండించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య పథకం విధివిధానాల గురించి అడిగితే ఆరోగ్య శాఖ ఇస్తుందని సమాధానం చెప్పిన ఆర్థిక శాఖ అధికారులు ఆ విధివిధానాలు లేకుండానే వేతనాల్లో కోత ఎలా పెడతారని ప్రశ్నించారు.
ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబ సభ్యుల వివరాలు ఐఎఫ్ఎంఐఎస్ సైట్ లో ఈ రోజు వరకు నమోదు చేయాలని గడువు విధించి, నిన్నటిదాకా వెబ్ సైట్ లో మార్పులు చేస్తూనే ఉన్నారని… వివరాలు పూర్తిగా తీసుకోనే లేదని… పాత నిబంధనల ప్రకారం భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒక్కరే చందా చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు ఇద్దరి నుంచి మినహాయించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆధారిత కుటుంబ సభ్యులపై స్పష్టత రానే లేదని..
నిజానికి ఉద్యోగుల, పెన్షనర్ల ఆరోగ్య సంరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం ఖరీదైన సమయంలో ఉద్యోగులు కూడా కొంత భరించాలని ప్రభుత్వం కోరినప్పుడు సంఘాలు అంగీకరించాయని ఆయన తెలిపారు. అయినా వేతనంలో 1.5% కోత నిర్ణయం పట్ల ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని.. వారిలో ఉన్న సందేహాలను తొలగించి ఆరోగ్య పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాల్సిన సమయంలో అందుకు తగిన చర్యలు తీసుకోకుండా ఇంత హడావుడిగా వేతనాల్లో కోత విధించడం ఉద్యోగుల్లో పలు అనుమానాలకు తావిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి వెంటనే జోక్యం చేసుకొని వేతనాల్లో కోతలు నిలివేయాలని జయప్రకాష్ డిమాండ్ చేశారు.
ఆర్థిక శాఖ తీసుకున్న ఏకపక్ష నియంతృత్వ నిర్ణయాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలవుతుందని ఆయన హెచ్చరించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
