Commercial LPG Cylinder Price Hike
ఆకేరు న్యూస్, డెస్క్: దేశవ్యాప్తంగా వ్యాపారాల నిర్వహణ మరింత భారంగా మారనుంది. కమర్షియల్ ఎల్పీజీ (LPG) సిలిండర్ల ధరలు మరోసారి భారీగా పెరిగాయి. చమురు కంపెనీలు పెంచిన కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా గత ఐదు నెలల కాలంలోనే కమర్షియల్ సిలిండర్ ధరలు దాదాపు రెండింతలు (డబుల్) కావడం గమనార్హం.
* హైదరాబాద్‌లో రికార్డు స్థాయికి..
తాజా సవరణ ప్రకారం, 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై దేశ రాజధాని ఢిల్లీలో రూ. 42 పెంచగా.. హైదరాబాద్‌లో అత్యధికంగా రూ. 52 వరకు పెరిగింది. 2026 జనవరిలో కేవలం రూ. 1,691.50 గా ఉన్న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర, తాజా పెంపుతో ఐదు నెలల్లోనే డబుల్ అయి వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో తాజా ధరల వివరాలు…
హైదరాబాద్: రూ. 3,367.00
కోల్‌కతా: రూ. 3,255.50
చెన్నై: రూ. 3,232.00
ఢిల్లీ: రూ. 3,113.50
ముంబై: రూ. 3,024.50
* చిన్న సిలిండర్లపై కూడా ప్రభావం..
కమర్షియల్ ధరలతో పాటు ఐదు కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ (Free Trade LPG) ధరపై కూడా రూ. 11 చొప్పున పెంపుదల అమల్లోకి వచ్చింది.
* పెరగనున్న టిఫిన్, భోజనం ధరలు…
కమర్షియల్ సిలిండర్ల ధరలు రికార్డు స్థాయికి చేరడంతో హోటళ్లు, రెస్టారెంట్లు మరియు టిఫిన్ సెంటర్ల యజమానులపై తీవ్ర ప్రభావం పడనుంది. పెరిగిన ఖర్చులను తట్టుకునేందుకు హోటల్ నిర్వాహకులు టిఫిన్లు, భోజనం మరియు టీ, కాఫీల ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో బయట తినే సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.
* డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులకు ఊరట…
వ్యాపార అవసరాలకు వాడే సిలిండర్ల ధరలు పెరిగినప్పటికీ, ఇళ్లలో వంట చేసుకొనే డొమెస్టిక్ ఎల్పీజీ (14.2 కేజీల) సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గృహ వినియోగదారుల సిలిండర్ ధరలు యథాతథంగా కొనసాగుతుండటం ఒక్కటే ప్రస్తుతానికి ఊరట కలిగించే అంశం.
