Saraswati Pushkaralu 2026
* పుష్కరాల ఆఖరి వేడుక
ఆకేరు న్యూస్, జయశంకర్ భూపాలపల్లి: ధార్మిక శోభతో విరాజిల్లిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం.. నేటితో సరికొత్త ఆధ్యాత్మిక చరిత్రను లిఖించింది. గత 12 రోజులుగా అత్యంత వైభవంగా సాగిన “సరస్వతీ అంత్య పుష్కర మహోత్సవాలు” నేటితో (జూన్ 1) మంగళప్రదంగా ముగిశాయి.
మే 21న కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి పవిత్ర హస్తాల మీదుగా ప్రారంభమైన ఈ పుష్కర మహా క్రతువు, ఈరోజు అంత్య వేడుకలతో ముగింపు దశకు చేరుకుంది.
ఈ పన్నెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర ప్రాంతాల నుండి దాదాపు 30 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.
* ముగింపు వేడుకల్లో వైదిక క్రతువులు – ప్రత్యేక హోమాలు
పుష్కరాల ఆఖరి రోజైన సోమవారం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ వేదికగా వేద పండితులు శాస్త్రోక్తంగా “లఘు చండీ హోమం” నిర్వహించారు. లోక కల్యాణార్థం, సకల దోష నివారణార్థం జరిగిన ఈ హోమాన్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అంతకుముందు రోజుల్లో జరిగిన మృత్యుంజయ హోమం, మేధా దక్షిణామూర్తి హోమం, మహా రుద్ర హోమాల మంత్రోచ్ఛారణలతో కాళేశ్వర తీరం ప్రతిధ్వనించింది. చదువుల తల్లి సరస్వతి అంత్య పుష్కరాలు కావడంతో, చివరి రోజున కూడా వేలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో నదీ తీరంలో సాంప్రదాయబద్ధంగా ‘అక్షరాభ్యాసాలు’ చేయించారు.
* సాయంత్రం ‘మహా నది హారతి’ ఆధ్యాత్మిక ప్రవచనాలు…
ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు సాయంత్రం సరస్వతీ ఘాట్ వద్ద గంగా హారతి తరహాలో కన్నులపండువగా “మహా నది హారతి” ఇవ్వనున్నారు. వేద మంత్రాల నడుమ సాగే ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీనితో పాటు, సాంస్కృతిక వేదికపై ప్రముఖ అవధాని, బ్రహ్మశ్రీ మడుగుల నాగఫణి శర్మ గారి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రవచనాలు భక్తులలో భక్తి భావాన్ని నింపనున్నాయి.
* పకడ్బందీగా ప్రభుత్వ ఏర్పాట్లు
లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిరంతరం క్షేత్రస్థాయి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సుమారు రూ. 30 కోట్ల బడ్జెట్తో ఘాట్ల ఆధునీకరణ, భక్తుల వసతి కోసం తాత్కాలిక టెంట్ సిటీలు, విద్యుత్ దీపాల అలంకరణ చేశారు. నదీ తీరంలో ప్రమాదాల నివారణకు గజ ఈతగాళ్లను, లైఫ్ గార్డులను అందుబాటులో ఉంచి, పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతను నిర్వహించింది.
