TGNPDCL Insurance Cheque deputy cm Bhatti vikramarka
* విధి నిర్వహణలో మృతి చెందిన ఎన్పీడీసీఎల్ లైన్మెన్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి లభించిన ఆర్థిక భరోసా
* మృతుడి భార్య స్వప్నకు రూ. 1 కోటి విలువైన ప్రమాద బీమా చెక్కు అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఎన్పీడీసీఎల్ పరిధిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన లైన్మెన్ సోన్కాంబ్లే ప్రమోద్ కుమార్ సతీమణి (నామినీ) సోన్కాంబ్లే స్వప్నకు రూ. 1 కోటి విలువైన ప్రమాద బీమా చెక్కును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లో అందజేశారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎన్పీడీసీఎల్కు గతంలో కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) ప్రకారం USSA-2/ USSA-3 పథకాల కింద శాలరీ ఖాతాలు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రూ. 1 కోటి విలువైన వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ కల్పిస్తున్నారు. ఈ పథకంలో భాగంగానే ఎన్పీడీసీఎల్ నిర్మల్ సర్కిల్ పరిధిలోని బాసరలో లైన్‌మన్‌గా పనిచేస్తున్న సోన్కాంబ్లే ప్రమోద్ కుమార్, 23 సెప్టెంబర్ 2024న బాసర శాఖలో తన ‘USSA-2’ శాలరీ ప్యాకేజీ ఖాతాను ప్రారంభించారు.
అయితే, దురదృష్టవశాత్తు ఆయన 24 మార్చి 2025న విధి నిర్వహణలో ఉండగా జరిగిన ప్రమాదంలో మరణించారు. ఆయన అకాల మరణం తర్వాత, మృతుని నామినీ అయిన సోన్కాంబ్లే స్వప్న క్లెయిమ్ దరఖాస్తును బాసర శాఖలో సమర్పించారు. ఈ క్రమంలో రూ. 1 కోటి బీమా మొత్తం మే 30, 2026 నాడే శ్రీమతి స్వప్న సేవింగ్స్ ఖాతాలో జమ అయింది. ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వానికి, బ్యాంకింగ్ రంగానికి ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తోంది. అలాగే USSA శాలరీ ప్యాకేజ్ పథకాల కింద అందిస్తున్న బీమా ప్రయోజనాల ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తోంది.
ప్రజాభవన్‌లో జరిగిన ఈ అధికారిక చెక్కు పంపిణీ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, ఫైనాన్స్ డైరెక్టర్ తిరుపతిరెడ్డి, యూనియన్ బ్యాంక్ సీఈవో అశిష్ పాండే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమరేష్ ప్రసాద్, చీఫ్ జనరల్ మేనేజర్ రవీంద్రబాబు, నిజామాబాద్ రీజినల్ హెడ్ అరుణ సవిత, చీఫ్ మేనేజర్ వై.వి రాఘవ, బ్రాంచ్ మేనేజర్ విజయ్ కుమార్, తదితర ఉన్నతాధికారులు పాల్గొని బాధిత కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.
