DK Shivakumar Swearing In
ఆకేరు న్యూస్, డెస్క్: కర్ణాటక రాజకీయాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని రాజ్ భవన్ (లోక్ భవన్) వేదికగా జరిగిన ఈ అట్టహాసమైన కార్యక్రమంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్.. డీకే శివకుమార్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. భగవంతుడి సాక్షిగా ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు.
ఇదే వేదికపై కర్ణాటక డిప్యూటీ సీఎంగా సీనియర్ నాయకుడు డాక్టర్ జి. పరమేశ్వర ప్రమాణస్వీకారం చేశారు. వీరితో పాటు మరో 13 మంది కీలక నేతలు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడం విశేషం. ఇందులో మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య తొలిసారి మంత్రిగా క్యాబినెట్లో అడుగుపెట్టారు.
* హాజరైన అగ్రనేతలు…
ఈ ప్రమాణస్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అధిష్ఠానం భారీగా తరలివచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు, ముఖ్యమంత్రులు ఈ వేడుకకు సాక్ష్యంగా నిలిచారు. కర్ణాటక అంతటా ఈ వేడుకను ప్రజలు వీక్షించేలా రవాణా సంస్థల బస్టాండ్లలో డిజిటల్ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.
* అధికార మార్పిడి నేపథ్యం..
గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన సమయంలోనే.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలనే అంతర్గత ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగానే గత వారం సిద్ధరామయ్య తన సీఎం పదవికి రాజీనామా చేయగా, హైకమాండ్ ఆదేశాల మేరకు డీకే శివకుమార్ ఇప్పుడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. సిద్ధరామయ్యను పార్టీ అత్యున్నత విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యునిగా నియమించి ఢిల్లీ రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించారు.
