* పోచారం ఇంటికి వెళ్లి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
* రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరాను
– పోచారం శ్రీనివాస రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ ఎస్ ఎమ్మెల్యే, అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు. వీరి భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. తాజా రాజకీయాలపై చర్చల అనంతరం పోచారంను కాంగ్రెస్‌లో చేరాలని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.దీంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం పోచారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. పోచారం శ్రీనివాస రెడ్డి అనుభవాన్ని ఉపయోగించుకుంటాం . వ్యవసాయాన్ని దండగ కాదు పండుగ చేసి చూపిస్తాం. రైతు సంక్షేమ రాజ్యం కోసం అండగా నిలిచే అందరి మద్దతు తీసుకుంటామన రేవంత్ రెడ్డి అన్నారు.
రాష్ట్రాన్ని 20 ఏళ్ళు ఏలే సత్తా రేవంత్ రెడ్డికి ఉంది.
పోచారం శ్రీనివాస రెడ్డి
రైతు బిడ్డను . రైతుల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి. రైతుల కోసం ఆలోచిస్తున్నాడు. రైతులకు మంచి చేసే రేంత్ రెడ్డి కి అండగా నిలబడాలని నిర్ణయించుకున్నాను. 20 ఏండ్లు పాలించే సత్తా రేవంత్ రెడ్డికి ఉంది. రాజకీయ జీవితమే కాంగ్రెస్ పార్టీతో మొదలైంది. తెలుగుదేశం , బీఆర్ ఎస్‌లో పనిచేశాను. తిరిగి కాంగ్రెస్‌లోకి రావడం సంతోషంగా ఉందని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.
* పోచారం ఇంటి వద్ద బీఆర్ ఎస్ ఆందోళన
మాజీ స్పీకర్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ బీఆర్ ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లోని శ్రీనివాస రెడ్డి ఇంటి వద్ద మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. పోలీస్‌లు అదుపులోకి తీసుకుని జూబ్లి హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బీఆర్ ఎస్‌కు దెబ్బ మీద..
రేవంత్ ఆహ్వానంతో పోచారం కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. రైతుల కోసం కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరుతున్నట్లు పోచారం ప్రకటించారు. పోచారం బాన్సువాడ నియోజకవర్గం నుంచి 2009 నుంచి 2023 వరకు వరసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎంపికయినారు. ఆ క్రమంలోనే పోచారం తెలంగాణ ప్రభుత్వంలో 2014-2019 వరకు వ్యవసాయ మంత్రిగా, 2019 జనవరి 17 నుంచి 2023 డిసెంబర్ 6 వరకు తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. బీఆర్ ఎస్ లో కీలక నేతగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్ ఎస్‌లో గుబులు మొదలైంది. లోక్ సభ ఫలితాలతో తీవ్ర నిరాశలో ఉన్న బీఆర్ ఎస్‌కు.. పోచారం పార్టీని వీడడంతో మరో పెద్ద దెబ్బ తగిలినట్లే.
————————————-