COLLECTOR CHAHAT BAJPAI Voter List Verification Drive
ఆకేరు న్యూస్, హనుమకొండ:
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SSR) కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు.
గురువారం హనుమకొండ పట్టణ పరిధిలోని చైతన్యపురి ప్రాంతంలో బూత్ స్థాయి అధికారులు (BLOలు) నిర్వహిస్తున్న ఇంటింటి ఓటరు ఫారాల పంపిణీ ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీఎల్వోలు ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్న తీరు, ఫారాల పంపిణీ, ఓటర్ల నమోదు ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్ల అవగాహన కోసం సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.

* ఎలాంటి పొరపాట్లకు తావుండొద్దు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. “బీఎల్వోలు ప్రతి ఇంటినీ తప్పనిసరిగా సందర్శించాలి. అర్హులైన ప్రతి పౌరుడికీ ఓటరు ఫారాలను అందజేయాలి. ఓటరు జాబితా సవరణ విషయంలో ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ, ఈ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది” అని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎలాంటి తప్పులు దొర్లకుండా పకడ్బందీగా విధులు నిర్వహించాలని హెచ్చరించారు.
ప్రజల నుంచి సేకరించిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా ఆన్లైన్ లేదా రికార్డుల్లో నమోదు చేయాలని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితా అత్యంత కీలకమైనదని, కాబట్టి అధికారులు, బీఎల్వోలు పూర్తి బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో ప్రజలు కూడా బాధ్యతగా భాగస్వాములై, బీఎల్వోలకు సరైన సమాచారం అందించి సహకరించాలని కోరారు.
ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డితో పాటు స్థానిక రెవెన్యూ సిబ్బంది, బూత్ స్థాయి అధికారులు (BLOలు) పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
