Telangana High Court Relief
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల యాజమాన్యాలకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి జారీ చేసిన జీవో నెంబర్ 9 (GO Ms No 9) లోని కొన్ని మార్గదర్శకాలపై హైకోర్టు మధ్యంతర స్టే విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలను సవాల్ చేస్తూ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం.. జీవో 9 మార్గదర్శకాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. ఈ స్టే ఆదేశాలు వచ్చే మంగళవారం వరకు అమల్లో ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది.
* యాజమాన్యాల అభ్యంతరం….
ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 లోని కొన్ని నిబంధనలు కాలేజీల నిర్వహణకు, విద్యార్థుల ఫీజుల చెల్లింపు ప్రక్రియకు ఇబ్బందికరంగా మారాయని ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ క్రమంలోనే కోర్టు స్పందిస్తూ ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ అంశంపై తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. హైకోర్టు తాజా నిర్ణయంతో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఊపిరి పీల్చుకున్నాయి.
