Gangaram Collector Surprise Inspection
* గంగారం మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
ఆకేరు న్యూస్, మహబూబాబాద్:
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ బుధవారం గంగారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఎంపీడీవో కార్యాలయం, పింఛన్ల పంపిణీ రికార్డులు, గ్రామీణాభివృద్ధి పనులతో పాటు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
* 752 మంది లబ్ధిదారులకు విత్తన కిట్ల పంపిణీ..
‘సమావేశక ఆజీవిక యోజన’ పథకం అమలు తీరును పరిశీలించిన కలెక్టర్, రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో 752 మంది లబ్ధిదారులకు 10 రకాల కూరగాయల విత్తనాల కిట్లను పంపిణీ చేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాణ్యమైన పంటలు పండించాలని సూచించారు. విత్తనాలు వేసిన విధానాన్ని స్వయంగా పరిశీలించి, స్థానిక రైతుల సామాజిక, ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
అలాగే డిఆర్డిఏ (DRDA) ఆధ్వర్యంలో చేపడుతున్న ‘ఫార్మ్ పాండ్’ (రైతు కుంటల) పనులను తనిఖీ చేసిన కలెక్టర్, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
* అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు..
మండల పరిధిలో పింఛన్ల పంపిణీ తీరును, దరఖాస్తుల వివరాలను కలెక్టర్ పరిశీలించారు. ఏ ఒక్క అర్హులైన లబ్ధిదారుడికీ సంక్షేమ పథకాలు దూరం కాకూడదని, ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు.
* కేజీబీవీ పాఠశాల తనిఖీ..
స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ స్నేహ శబరిష్, విద్యార్థినులకు అందుతున్న విద్యాబోధన, భోజన వసతి, పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థినుల భద్రత, ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని పాఠశాల సిబ్బందిని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో DRDO ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, ప్రత్యేక అధికారి వెంకటరమణ, ఉద్యానవన శాఖ అధికారి జి. మరియాన్న, తహసీల్దార్ బాలకృష్ణ, ఎంపీడీవో వైష్ణవి, ఆస్పిరేషనల్ బ్లాక్ అధికారి శ్రీనాథ్, ఇతర అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
