Ayodhya Temple Donation Scam
ఆకేరు న్యూస్, డెస్క్: అయోధ్య బాలరాముడి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల సొమ్ము పక్కదారి పట్టిన వ్యవహారంలో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఆలయ విరాళాల లెక్కింపులో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరుపుతున్న అధికారులకు, నిందితులు అవలంబించిన విస్తుపోయే వ్యూహాలు అవాక్కయ్యేలా చేస్తున్నాయి. కాజేసిన నగదును వెంటనే బయటకు తీసుకెళ్తే దొరికిపోతామనే భయంతో, నిందితులు ఆ సొమ్మును ఆలయ ప్రాంగణంలోని మరుగుదొడ్లలో (Toilets) దాచి, ఆ తర్వాత దశలవారీగా బయటకు తరలించినట్లు విచారణలో తేలింది.
* రెండు గంటల పాటు నిందితుడి విచారణ..
ఈ భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన అవినాశ్ శుక్లాను విచారణాధికారులు అదుపులోకి తీసుకుని సుమారు రెండు గంటల పాటు క్షుణ్ణంగా ప్రశ్నించారు. ఈ విచారణలో నిందితుడు తప్పును ఒప్పకోవడమే కాకుండా.. అసలు ఈ దోపిడీ ఎలా సాగిందో పూసగుచ్చినట్లు వివరించాడు.
ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియలో ఉన్న తీవ్రమైన భద్రతా లోపాలను తాము అనుకూలంగా మార్చుకున్నట్లు అంగీకరించాడు. రోజువారీ లెక్కింపులో కొట్టేసిన కోట్ల రూపాయలను మొదట ఎవరికీ అనుమానం రాకుండా ఆలయ టాయిలెట్లలో దాచేవారమని, ఆ తర్వాత పరిస్థితిని బట్టి కొద్దికొద్దిగా బయటకు తరలించేవారమని నిందితుడు వెల్లడించినట్లు సమాచారం.
* లోపభూయిష్టంగా భద్రతా వ్యవస్థ..
ఈ వ్యవహారంలో కేవలం అవినాశ్ శుక్లా మాత్రమే కాకుండా.. ఆలయ అంతర్గత సిబ్బందితో పాటు మరికొందరి హస్తం కూడా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. విరాళాల సేకరణ, లెక్కింపు, భద్రత తదితర విభాగాల్లో ఉన్న లోపాలపై అధికారులు ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించారు. లెక్కింపు గదుల్లో సీసీటీవీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున సొమ్ము ఎలా పక్కదారి పట్టిందనే కోణంలో సమగ్ర పరిశీలన జరుపుతున్నారు. ఈ కేసులో త్వరలోనే మరికొన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందని ఆలయ వర్గాల ద్వారా తెలుస్తోంది. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.
