cm Revanth Rewari Parakala Politics
* కొండా కుటుంబానికి చెక్ మేటా..?
ఆకేరు న్యూస్ ,వరంగల్ :
పరకాల కాంగ్రెస్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న రేవూరి ప్రకాశ్‌రెడ్డి–కొండా కుటుంబం ఆధిపత్య పోరుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజా పర్యటన కొత్త మలుపు తిప్పింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పరకాల నుంచి రేవూరి ప్రకాశ్‌రెడ్డే పోటీ చేస్తారని సీఎం బహిరంగ సభ వేదికపై ప్రకటించడం ఇప్పుడు ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. రేవూరిని మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరడం ద్వారా ఆయనకు సీఎం రాజకీయంగా స్పష్టమైన భరోసా ఇచ్చినట్లయింది.
* రేవూరికి రేవంత్ భరోసా
సాధారణంగా ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పుడు అభ్యర్థిత్వాలపై పార్టీ అధిష్ఠానం స్పష్టమైన ప్రకటన చేయదు. కానీ పరకాల సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి నాయకత్వంలోనే నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పడంతో పాటు భవిష్యత్తులోనూ ఆయనను ఆశీర్వదించాలని కోరడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పరకాల కాంగ్రెస్‌లో రేవూరి స్థానంపై వస్తున్న సందేహాలకు సీఎం తనదైన శైలిలో సమాధానం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.
* మరి సుస్మిత పరిస్థితి ఏంటి?
ఇక్కడే అసలు రాజకీయ వివాదం మొదలవుతోంది. మంత్రి కొండా సురేఖ గతంలో పరకాల ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే పరకాలపై కొండా కుటుంబం రాజకీయ ఆసక్తిని వదులుకోలేదు. కొండా సురేఖ కుమార్తె సుస్మిత వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేయాలనే ఉద్దేశాన్ని ఇప్పటికే బహిరంగంగా వెల్లడించారు. కొండా కుటుంబం కూడా ఈ స్థానంపై పట్టుదలతో ఉన్నట్లు గత కొంతకాలంగా సంకేతాలు ఇస్తోంది.
* పాత పోరుకు కొత్త మలుపు
రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కొండా సురేఖ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొత్తది కాదు. 2023లో రేవూరి పరకాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రెండు వర్గాల మధ్య విభేదాలు పలుమార్లు బయటపడ్డాయి. లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఈ విభేదాలు బహిరంగ చర్చకు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కొండా కుటుంబం పరకాల టికెట్‌ను ఆశించగా పార్టీ నాయకత్వం రేవూరికి అవకాశం ఇచ్చింది.
* సురేఖ గైర్హాజరు.. రాజకీయ సంకేతమా?
ఈ పరిణామాల మధ్య సీఎం పర్యటనలో మంత్రి కొండా సురేఖ కనిపించకపోవడం మరింత చర్చకు కారణమైంది. మేడారం కార్యక్రమంతో పాటు పరకాల సభలోనూ ఆమె పాల్గొనలేదు. అదే సభలో రేవూరికి సీఎం రాజకీయ భరోసా ఇవ్వడంతో సురేఖ గైర్హాజరుకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఆమె ఎందుకు హాజరుకాలేదనే విషయంపై అధికారిక కారణం స్పష్టంగా తెలియాల్సి ఉంది .
ఏదేమైనా రేవంత్ వ్యాఖ్యతో పరకాల కాంగ్రెస్‌లో ఇప్పటివరకు అంతర్గతంగా సాగుతున్న టికెట్ పోటీ మరోసారి బహిరంగ చర్చకు వచ్చింది. రేవూరికే వచ్చే ఎన్నికల్లో అవకాశం ఉంటుందన్న సీఎం వాగ్దానం అమలైతే, పరకాల నుంచి రాజకీయ అరంగేట్రం చేయాలనుకుంటున్న సుస్మితకు ప్రత్యామ్నాయం ఏమిటన్నది ప్రశ్న. ఇప్పుడు దీనిపై కొండా కుటుంబం ఎలా స్పందిస్తుందన్నదే ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.
————

Please tell us what is wrong. Your report will be sent to the website team.
