cm Revanth Reddy Assembly Challenge
* కేటీఆర్, హరీశ్‌రావు రక్తపిపాసులు..
* సీతక్క నా సోదరి
– సీఎం రేవంత్
ఆకేరు న్యూస్ పరకాల: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావులను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘కేటీఆర్, హరీశ్‌రావు రక్తపిపాసులు.. కార్యకర్తల రక్తం తాగుతున్నారు’’ అంటూ విరుచుకుపడ్డారు. సెప్టెంబర్‌లో శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని, దమ్ముంటే ‘‘బావా–బామ్మర్దులు’’ అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.
ఆదివారం ములుగు, పరకాల పర్యటనల్లో మాట్లాడిన రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ అధినాయకత్వంపై విమర్శల తీవ్రత పెంచారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి రూ.8.11 లక్షల కోట్ల అప్పులను వారసత్వంగా ఇచ్చిందని ఆరోపించారు. ప్రస్తుతం ఏటా సుమారు రూ.75 వేల కోట్లు అసలు, వడ్డీల చెల్లింపులకే వెళ్తున్నాయని చెప్పారు. ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లోనూ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
ములుగు సభలో కేటీఆర్‌ను ఉద్దేశించి మరింత వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేశారు. రక్తసంబంధం లేకపోయినా మంత్రి సీతక్కను తాను సొంత సోదరిగా భావిస్తానని, కానీ సొంత సోదరికే న్యాయం చేయలేని వారు రాష్ట్రంలోని రెండు కోట్ల మంది ఆడబిడ్డలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. కుమారుడిని మందలించాల్సిన తండ్రి ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని కేసీఆర్‌పైనా విమర్శలు చేశారు. హరీశ్‌రావును ‘‘అఘోరారావు’’గా అభివర్ణిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పరకాల సభలో ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కూడా రేవంత్ ప్రస్తావించారు. ప్రజల వ్యక్తిగత సంభాషణలను కూడా ట్యాప్ చేసిన గత పాలకులకు ప్రజలే ఎన్నికల్లో గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని ‘‘కేసీఆర్‌ది ఫ్యామిలీ జస్టిస్ అయితే.. నాది సోషల్ జస్టిస్’’ అని ప్రకటించారు. వెయ్యిమంది కేసీఆర్‌లు వచ్చినా తమ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు.
—-

Please tell us what is wrong. Your report will be sent to the website team.
