Palakurthi Congress Internal Dispute
* పాలకుర్తి సాక్షిగా ఒక సామాన్య కార్యకర్త ఆత్మఘోష
ఆకేరు న్యూస్, తొర్రుర్ :
ఒక చేతిలో కాంగ్రెస్ జెండా.. గుండె నిండా గాయాలు అంటూ ఆవేదనతో తొర్రూరు మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సుంచు సంతోష్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాటల్లోనే ..
” రాజకీయం అంటే కొందరికి ఐదేళ్ల ఆట కావచ్చు.. కొందరికి వ్యాపారం కావచ్చు.. కానీ నా లాంటి సగటు కార్యకర్తకు రాజకీయం అంటే ఒక శ్వాస.. కాంగ్రెస్ జెండా అంటే ఒక పవిత్రమైన నమ్మకం!
కానీ ఈరోజు… ఆ నమ్మకం నడిరోడ్డుపై నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తోంది. 138 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ పార్టీని, ఎందరో త్యాగధనుల శ్రమతో నిర్మించబడిన ఈ పవిత్ర నేలను.. కొందరు కలిసి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా మార్చేస్తుంటే గుండె తరుక్కుపోతోంది.
పాలకుర్తి నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ కోసం తమ జీవితాలను ధారపోసిన సైనికులు మూలన కూర్చుని కన్నీరు పెట్టుకుంటున్నారు. నిన్నటిదాకా అధికార పీఠాలపై కూర్చుని, మనల్ని నానా మాటలు అని, మహిళలను “అమ్మలు బొమ్మలు” అంటూ హేళన చేసిన వలస పక్షులు ఈరోజు మన ఇంట్లోకి వచ్చి మన తలలపై కూర్చుని శాసిస్తుంటే… ఈ అన్యాయాన్ని ఏమని నిలదీయాలి?
* 75 వేల గుండెల ఆవేదన.. వింటున్నారా అధిష్టాన పెద్దలారా?
ఈ మట్టిని నమ్ముకున్న దళితులకు ఈ రెండున్నరేళ్లుగా ఎదురవుతున్నది కేవలం అవమానాలే. 75 వేల మందికి పైగా ఉన్న దళిత సోదరుల ఆత్మగౌరవాన్ని కాలరాస్తూ కాంగ్రెస్కు చెడ్డపేరు తెస్తున్న ఆ స్వార్థపరులు ఎవరు?
గుర్తు తెచ్చుకోండి… గత మున్సిపాలిటీ ఎన్నికల్లో తొర్రూరులో నాలుగు కౌన్సిలర్ స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ అయితే, అందులో ఒక్కటంటే ఒక్క సీటు కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వకుండా నట్టేట ముంచారు. దానికి తోడు, దేవరుప్పుల, తొర్రూరు మండలాల్లో రాత్రింబగళ్లు పార్టీ కోసం అరిగిపోయిన దళిత నాయకులను అధ్యక్ష పదవుల నుంచి అర్థాంతరంగా తొలగించారు.
ఆ స్థానాల్లో నిన్న గాక మొన్న వలస వచ్చిన వారికి ఎర్ర తివాచీలు పరిచి పదవులు కట్టబెట్టారు. కనీసం ఒక్క దళితుడికి కూడా అధ్యక్ష పదవి దక్కకుండా చేయడం వెనుక ఏ శక్తులు పనిచేస్తున్నాయి?
మనం ఓడిపోతామని తెలిసి కూడా.. నాడు పార్టీ ఉనికి కోసం, కాంగ్రెస్ పరువును కాపాడటం కోసం జెడ్పీటీసీగా నిలబడి సర్వస్వం పణంగా పెట్టిన నిఖార్సైన నాయకులను ఈరోజు ఏ మూలకో విసిరేసారు. అవసరం తీరాక కరివేపాకులా తీసిపారేసే ఈ కుటిల నీతితోనా మనం సామాజిక న్యాయం సాధించేది?
* నిబంధనల సమాధిపై వలసల రాజభోగాలా?
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ గారు, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు బహిరంగంగానే చెప్పారు.. “2018కి పూర్వం పార్టీ జెండా మోసిన వారికే పదవులు ఇవ్వాలి” అని. మరి పార్టీ బైలాస్లోనే ఉన్న ఆ పవిత్రమైన నిబంధన పాలకుర్తి సరిహద్దుల్లోకి వచ్చేసరికి సమాధి అయిపోయిందా? బీఆర్ఎస్ హయాంలో అధికార సుఖాలు అనుభవించి, సీటు పోయాక 2024, 2025లో కాంగ్రెస్లోకి దూకిన వలస వీరులకు ఏ నైతికతతో ఈ పెద్దపీట వేస్తున్నారు? ఇది కష్టకాలంలో పార్టీని ప్రాణంగా కాపాడిన నాయకుల ఆత్మగౌరవాన్ని నడిబజార్లో దెబ్బతీయడం కాదా?
ఈ నియోజకవర్గంలో కనీసం ఓటు హక్కు కూడా లేని వారు ఈరోజు కాంగ్రెస్ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంటే.. కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా మనం ఇంకా ఎంతకాలం ఈ మౌన క్షోభను అనుభవించాలి?
* నా ఆఖరి శ్వాస సాక్షిగా..
రాజకీయంలో పదవులు ఈరోజు వస్తాయి.. రేపు పోతాయి. కానీ నైతికత చచ్చిపోతే మనిషికి విలువ లేదు. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన మన ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి, మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై చూడడానికి ఒక వీర సైనికుడిగా నా శక్తినంతటినీ ధారపోస్తాను. కానీ, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను కాదని.. కండువాలు మార్చి వచ్చిన వలస పాలకులకు ఈ కాంగ్రెస్ సామ్రాజ్యాన్ని ధారాదత్తం చేస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకోను. ఎంతటి త్యాగానికైనా నేను సిద్ధం!”
