World Bank Report telangana
* ఎగువ మద్యతరగతిలో 3 వ స్థానం
* ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో ఆసక్తికర అంశాలు
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి : ఆర్థికంగా దూసుకుపోతున్నా, క్షేత్రస్థాయి సామాజిక-ఆరోగ్య భద్రత పరంగా తెలంగాణ రాష్ట్రం వెనుకబడిందని ప్రపంచ బ్యాంకు నివేదిక కొన్ని తీవ్రమైన లోపాలను ఎత్తిచూపింది.ప్రపంచ బ్యాంకు యొక్క తాజా నివేదిక ప్రకారం, భారతదేశం అంతటా సగటు ఆదాయం ‘లోయర్-మిడిల్-ఇన్కమ్’ లోనే ఉన్నప్పటికీ.. దేశంలోనే ఈ గీత దాటి ‘అప్పర్-మిడిల్-ఇన్కమ్ హోదా సాధించిన టాప్-5 రాష్ట్రాలలో తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది ప్రపంచ బ్యాంకు అప్పర్-మిడిల్-ఇన్కమ్ దేశాల కనీస వార్షిక తలసరి ఆదాయ పరిమితిని $4,636 డాలర్లుగా నిర్ణయించగా, తెలంగాణ తలసరి ఆదాయం ఏకంగా $5,407 డాలర్లకు చేరింది. ఈ ఆదాయంతో తెలంగాణ రాష్ట్రం ఇండోనేషియా, వియత్నాం వంటి వేగంగా ఎదుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను కూడా అధిగమించిందని నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో మాతృ మరణాల రేటు (MMR) ప్రతి లక్ష ప్రసవాలకు 45 గా నమోదైంది, ఇది జాతీయ సగటు (93) కంటే సగానికి పైగా తక్కువ. అలాగే 99% గర్భిణీ స్త్రీలకు ప్రసవ పూర్వ సంరక్షణ (Antenatal care), 87% పైగా చిన్నారులకు సంపూర్ణ టీకాలు అందుతున్నాయని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది.
* తీవ్రమవుతున్న అసంక్రమిత వ్యాధులు (NCDs)
తెలంగాణలో జీవనశైలి మార్పులు, వేగవంతమైన పట్టణీకరణ (Urbanisation) వల్ల మధుమేహం, హైపర్టెన్షన్ , గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయని ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. మరో వైపు వృద్ధుల జనాభా పెరుగుతుండటంతో రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి పడుతోందని, ప్రస్తుత ఆసుపత్రుల విధానం దీనిని తట్టుకోవడానికి సరిపోదని హెచ్చరించింది.
* అమ్మో .. రోడ్డు ప్రమాదాలు :
కేవలం 2024 ఒక్క సంవత్సరంలోనే తెలంగాణలో రహదారి ప్రమాదాల వల్ల 7,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత ఆందోళనకరమైన విషయంగా ప్రపంచ బ్యాంకు తన నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీనివల్ల తలెత్తుతున్న అత్యవసర ట్రామా కేర్ (Trauma Care) అవసరాలను అందుకోవడంలో ప్రస్తుత మౌలిక వసతులు విఫలమవుతున్నాయని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో వైద్య సేవలు మెరుగుపడాలంటే ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రపంచ బ్యాంకు కఠినమైన షరతు పెట్టింది. అంతేకాకుండా, బయోమెడికల్ వ్యర్థాల (Biomedical Waste) నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని, ప్రభుత్వ ఆసుపత్రులలో వికలాంగుల కోసం కనీస వసతులైన ర్యాంపులు (Ramps), ప్రత్యేక టాయిలెట్లు కూడా లేకపోవడాన్ని నివేదిక వేలెత్తి చూపింది. కాగా ఈ సవాళ్లను అధిగమించడానికి మరియు ఆరోగ్య రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి తెలంగాణ ప్రభుత్వం “TG-SVASTH” (Telangana Strategic Vision for Attaining Sustainable Transformation in Health Care) కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికోసం ప్రపంచ బ్యాంకు నుంచి ₹2,580 కోట్ల ($300 మిలియన్ డాలర్లు) భారీ రుణం పొందేందుకు తుది ముసాయిదా ప్రణాళికలను సిద్దం చేసింది.
—————————
————————-
