TSRTC Conductor Recruitment 2026
ఆకేరు న్యూస్, డెస్క్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకగా శుభవార్త అందించింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసీ)లో 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీంతో, నోటిఫికేషన్ విడుదలకు ఆర్టీసీ యాజమాన్యం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ పోస్టులకు రాత పరీక్ష లేకుండా, కేవలం అభ్యర్థుల 10వ తరగతి (ఎస్ఎస్ సీ) మార్కుల ఆధారంగానే మెరిట్ జాబితాను రూపొందించి ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఇది నిరుద్యోగులకు పెద్ద ఊరట కలిగించే అంశం.
అయితే, ఈ ఎంపిక ప్రక్రియలో ఒక సాంకేతిక సమస్య ఎదురైంది. పదో తరగతి పాసైన వారిలో కొంతమందికి మెమోలలో మార్కులు, మరికొంతమందికి గ్రేడింగ్ పాయింట్లు ఉన్నాయి. మార్కులను మరియు గ్రేడింగ్‌లను మెరిట్ కోసం ఎలా పోల్చాలి, గ్రేడింగ్‌ను మార్కుల శాతంగా ఎలా లెక్కించాలి అనే అంశంపై స్పష్టత కోసం ఆర్టీసీ అధికారులు ఎస్ఎస్ సీ బోర్డుకు లేఖ రాశారు. ప్రస్తుతం ఎస్ఎస్ సీ బోర్డు నుండి వచ్చే స్పష్టత ఆధారంగా తుది నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ప్రక్రియ తేదీలను ఖరారు చేయనున్నారు.
