Silver Jagannath Chariot Udaipur
ఆకేరు న్యూస్, డెస్క్: రాజస్థాన్‌లోని చారిత్రక నగరం ఉదయ్పుర్లో జగన్నాథ స్వామి రథయాత్రకు ఏర్పాట్లు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దేశంలోనే పూరీ జగన్నాథుడి రథయాత్ర తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన ఉదయ్‌పుర్ రథోత్సవంలో ఈ ఏడాది ఒక ప్రత్యేక ఆకర్షణ నిలవనుంది. స్వామివారి కోసం ఏకంగా 95 కిలోల స్వచ్ఛమైన వెండితో ఒక భారీ రథాన్ని నిపుణులు సిద్ధం చేస్తున్నారు.
* 58 విడిభాగాలు.. 21 అడుగుల ఎత్తు..
ఈ అద్భుతమైన రథాన్ని అత్యంత ఆకర్షణీయంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు హస్తకళాకారులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. సాంప్రదాయ పద్ధతిలో, ఎక్కడా ఆధునిక యంత్రాల సాయం లేకుండా కేవలం చేతిపనితోనే దీనిని రూపుదిద్దుతున్నారు.
రథం ఎత్తు 21 అడుగులు, రథం పొడవు 17 అడుగులు, విడిభాగాలు దాదాపు 58.. విడిభాగాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తూ ఈ రథాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ విడిభాగాలను జోడించి, రథానికి తుది మెరుగులు దిద్దే పనులు వేగంగా సాగుతున్నాయి. రథంపై చెక్కిన శిల్పకళాఖండాలు, సాంప్రదాయ రాజస్థానీ డిజైన్లు భక్తులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
* ఉదయ్‌పుర్ జగన్నాథ రథయాత్ర ప్రత్యేకత…
పూరీ తరహాలోనే ఉదయ్పుర్లో కూడా ఆషాఢ శుద్ధ విదియ రోజున ఈ రథయాత్ర అత్యంత ఘనంగా ప్రారంభమవుతుంది. ఇక్కడి ప్రసిద్ధ జగదీష్ ఆలయం (Jagdish Temple) నుంచి ఈ యాత్ర మొదలై నగరం అంతటా సాగుతుంది. లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలివస్తారు. ఈసారి 95 కిలోల వెండి రథంపై జగన్నాథుడు ఉదయ్‌పుర్ వీధుల్లో విహరించనుండటంతో భక్తులలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఈ వేడుకను వీక్షించేందుకు స్థానికులతో పాటు దేశ విదేశాల నుంచి పర్యాటకులు కూడా భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
