AP Police Recruitment 2026
* 1,534 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఆకేరు న్యూస్, డెస్క్ : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో 1,534 పోలీస్, ఇతర అనుబంధ శాఖల పోస్టుల (AP Police Recruitment) భర్తీకి ఏపీ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (APSLPRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 378 సబ్ ఇన్స్పెక్టర్ (SI) పోస్టులు, 1,156 కానిస్టేబుల్ స్థాయి పోస్టులు ఉన్నాయి. నవంబర్ 27వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది.
* డిసెంబర్ 16 వరకు దరఖాస్తులు..
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ పోలీస్ నియామక మండలి (AP Police Recruitment 2026) అధికారిక వెబ్సైట్ https://slprb.ap.gov.in ద్వారా అప్లికేషన్లు సమర్పించాలి. ఈ మేరకు నియామక మండలి ఛైర్మన్ రాజీవ్ కుమార్ మీనా వివరాలు వెల్లడించారు.
* 378 ఎస్ఐ పోస్టుల వివరాలు
మొత్తం 378 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను మూడు విభాగాల్లో భర్తీ చేయనున్నారు.
– సివిల్ ఎస్ఐ పోస్టులు – 253
– ఆర్మ్డ్ రిజర్వ్ (AR) రిజర్వ్ ఎస్ఐ పోస్టులు – 116
– స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) ఎస్ఐ పోస్టులు – 9
సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ పోస్టుల్లో పురుషులు, మహిళలకు అవకాశం ఉండగా.. SPF ఎస్ఐ పోస్టులు పురుషులకు కేటాయించారు.
* 1,156 కానిస్టేబుల్ స్థాయి పోస్టులు
మిగిలిన 1,156 పోస్టులు పోలీస్, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో ఉన్నాయి.
– సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లు – 542
– ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుళ్లు – 285
– ఫైర్మెన్ – 158
– పురుష వార్డర్లు – 150
– మహిళా వార్డర్లు – 21
ఈ పోస్టుల ద్వారా పోలీస్ శాఖతో పాటు రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలు, జైళ్లు మరియు సవరణ సేవల విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పరీక్షల తేదీలు ఖరారు
నియామక ప్రక్రియలో భాగంగా ప్రాథమిక రాత పరీక్షల తేదీలను కూడా పోలీస్ నియామక మండలి ప్రకటించింది. కానిస్టేబుల్ అభ్యర్థులకు 2027 జనవరి 31న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
ఎస్ఐ అభ్యర్థులకు 2027 ఫిబ్రవరి 28న పరీక్ష జరగనుంది. రెండు పేపర్లుగా పరీక్ష నిర్వహిస్తారు.
– పేపర్-1 : ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు
– పేపర్-2 : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు
అభ్యర్థులకు కీలక సూచనలు
దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు సంబంధిత పోస్టుల నోటిఫికేషన్ను పూర్తిగా చదవాలని నియామక మండలి సూచించింది. విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, పరీక్షల సిలబస్, దరఖాస్తు ఫీజు తదితర వివరాలను పరిశీలించిన తర్వాతే అప్లై చేయాలి. ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించిన అనంతరం ఫైనల్ అప్లికేషన్ కాపీని డౌన్లోడ్ చేసుకుని భద్రపరచుకోవాలి.
ఇక కమ్యూనికేషన్స్ విభాగం ఎస్ఐ, పీటీవో, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సైంటిఫిక్ అసిస్టెంట్లు, కమ్యూనికేషన్ కానిస్టేబుళ్లు, డ్రైవర్ అండ్ మెకానిక్, ఎస్డీఆర్ఎఫ్ డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల షెడ్యూల్ను విడిగా ప్రకటించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఏపీలో 1,534 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావడంతో పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది.
Also Read : ముంబైలో ఎవరికీ భద్రత లేదా..?

Please tell us what is wrong. Your report will be sent to the website team.

