Harish Rao Revanth Criticism
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ పరిధిలో ఆరుగురి దారుణ హత్య ఉదంతంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ ఘోర ఉదంతం అత్యంత హృదయ విదారకరమని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
* ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
షాబాద్ ఘటనపై హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇంత పెద్ద దారుణం జరిగి రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం పోలీసుల, ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారని విమర్శించారు. షాబాద్లో జరిగినవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
* రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి..
రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తిన హరీష్ రావు.. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి కొంచెమైనా మానవత్వం, నైతిక బాధ్యత ఉంటే హోంమంత్రిగా వైఫల్యం చెందినందుకు గానూ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
