Warangal Waste Segregation Drive , GWMC Commissioner T. Venkanna
* తడి–పొడి చెత్తను వేర్వేరుగా అందించి నగర పరిశుభ్రతకు సహకరించాలి
– జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న
అకేరు న్యూస్, వరంగల్ : నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న పిలుపునిచ్చారు.
వరంగల్ పరిధిలోని 24వ డివిజన్లో కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి కాకతీయ థియేటర్, చమన్, బట్టల బజార్ ఫ్లైఓవర్ బ్రిడ్జి, జ్యోతి కాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి పారిశుద్ధ్యంపై వారి అభిప్రాయాలను తెలుసుకుని, అవసరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలోని ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని, ప్రజలు తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఉంచి స్వచ్ఛ ఆటోలు వచ్చినప్పుడు అందించాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని, నగరాన్ని స్వచ్ఛంగా ఉంచే లక్ష్యంతో కార్పొరేషన్ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
అనంతరం బట్టల బజార్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద పేరుకుపోయిన సి & డి (కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్) వ్యర్థాలను గమనించిన కమిషనర్, వాటిని తక్షణమే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా పారిశుద్ధ్య జవాన్లు నిర్వహిస్తున్న హాజరు, విధుల రిజిస్టర్ను పరిశీలించిన కమిషనర్, పారిశుద్ధ్య పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రతి రోజు నిర్దేశిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు సమర్థవంతంగా నిర్వహించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ పర్యటనలో సీఎంహెచ్ఓ డా. రాజారెడ్డి, ఎంహెచ్ఓ డా. రాజేష్, డీఈ రంగారావు, శానిటరీ సూపర్వైజర్ గోల్కొండ శ్రీను, పారిశుద్ధ్య జవాన్లు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
