Warangal CP Swetha Security Reduction
అకేరు న్యూస్, వరంగల్ :
రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో, పోలీస్ అధికారులకు కేటాయిస్తున్న గన్మెన్ల విధానాన్ని పునఃసమీక్షించాలంటూ వరంగల్‌కు చెందిన మహ్మద్ ఫసియుజ్జామా రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. ప్రస్తుతం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులకు విరివిగా అమలు చేస్తున్న ‘వన్ ప్లస్ వన్’ (1+1) గన్మెన్లు/పీఎస్ఓల కేటాయింపుపై పునరాలోచన చేయాలని ఆయన కోరారు.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, ఇలాంటి తరుణంలో అవసరమైన వారికి మాత్రమే భద్రత కల్పించాలని లేఖలో సూచించారు. ముప్పు లేని అధికారుల వద్ద ఉన్న అదనపు సిబ్బందిని వెనక్కి పిలిపించి, పోలీస్ స్టేషన్లలో కేటాయించడం ద్వారా సిబ్బంది కొరతను అధిగమించవచ్చని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.
* ఆదర్శంగా నిలిచిన సీపీ శ్వేత..
ఇదిలావుండగా, నక్సల్స్ నుంచి తనకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ (సీపీ) శ్వేత తన వ్యక్తిగత భద్రతను తగ్గించుకున్నారు. గతంలో ఆమెకు నలుగురు గన్మెన్లు ఉండగా, ఆ సంఖ్యను ఇద్దరికి కుదించుకుంటూ స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారు. సిబ్బందిని వృథా చేయకుండా క్షేత్రస్థాయి విధులకు వాడుకోవాలనే ఉద్దేశంతో సీపీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు పోలీస్ శాఖతో పాటు ప్రజల్లోనూ విశేష ఆదరణ పొందుతోంది.

