BC Artisans Exhibition Hyderabad
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కులవృత్తుల మేళాకు నగర ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బోనాల పండుగకు కావలసిన కుండలు, బుట్టలు, మట్టి పాత్రలు తదితర సాంప్రదాయ వస్తువులను కొనుగోలు చేస్తూ నగరవాసులు స్థానిక కళాకారులకు అండగా నిలుస్తున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
* రేపు ఆదివారం సెలవు దినం కుటుంబంతో కలిసి రండి..
మొత్తం 60 స్టాళ్లతో 15 రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనను రేపు (ఆదివారం) సెలవు దినం కావడంతో నగర ప్రజలు కుటుంబ సమేతంగా సందర్శించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. బీసీ వర్గాలకు చెందిన కళాకారులు ఎంతో శ్రమించి తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసి వారిని ఆర్థికంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
* కళాకారుల జీవనోపాధికి భరోసా.. ప్రభుత్వం నూతన ఊతం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సాంప్రదాయ వృత్తులకు నూతన ఊతాన్ని అందిస్తోందని మంత్రి తెలిపారు. కళాకారులు దళారీల ప్రమేయం లేకుండా తమ ఉత్పత్తులను నేరుగా ప్రజలకు విక్రయించుకునేందుకు ఈ ప్రత్యేక స్టాళ్లను కేటాయించామని చెప్పారు. ఈ చర్య ద్వారా రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటమే కాకుండా, పర్యావరణహిత, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించినట్లవుతుందని స్పష్టం చేశారు.
* ఒకే చోట తెలంగాణ అద్భుత కళాఖండాలు..
ఈ మేళాలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రసిద్ధ ఉత్పత్తులు ఒకే చోట లభిస్తున్నాయి:
టెర్రకోట, మట్టి పాత్రలు, మేదర బుట్టలు, జనపనార ఉత్పత్తులు.
గద్వాల్, నారాయణపేట, పోచంపల్లి ఇకత్ చేనేత వస్త్రాలు.
నిర్మల్ బొమ్మలు, నిర్మల్ చిత్రకళ, పెంబర్తి ఇత్తడి కళాఖండాలు, వెండి ఫిలిగ్రీ వస్తువులు.
వినాయక చవితి ముందస్తు ఏర్పాట్లలో భాగంగా పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలు.
సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలోని సేంద్రీయ ఆహార ఉత్పత్తులు, సాంప్రదాయ ఔషధాలు మరియు ప్రభుత్వ విజయ డెయిరీ ప్రొడక్ట్స్.
ప్రదర్శనలో పాల్గొన్న కళాకారుల నైపుణ్యాన్ని అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. ఈ సాంప్రదాయ కళలను భావితరాలకు అందించేందుకు నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజలు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా వేలాది మంది కళాకారుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని పిలుపునిచ్చారు.
