Telangana New Pensions August 15
* ప్రతి గ్రామానికి తారు రోడ్డు
* మహిళలకు క్వాలిటీ చీరలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలోని తలసేమియా, సికిల్సెల్ అనీమియా బాధితులందరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన బాధితులను వెంటనే గుర్తించి, వచ్చే ఆగస్టు 15వ తేదీ నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఈ పింఛన్లు బాధిత కుటుంబాలకు ఎంతో ఊరట కలిగిస్తాయని పేర్కొన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయాలుఇలా ఉన్నాయి.
* దివ్యాంగుల కుటుంబాలకు తక్షణ భరోసా..
దివ్యాంగులైన పింఛన్దారులు మరణిస్తే, వారి భార్యలకు ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే పింఛన్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులందరికీ సంతృప్తికర స్థాయిలో పింఛన్లు ఇవ్వాలన్నారు.
* రాష్ట్రంలో తారు రోడ్డు లేని గ్రామం ఉండకూడదు..
తెలంగాణలో ప్రతి గ్రామానికి తారు రోడ్డు సౌకర్యం కల్పించాలని, ప్రతి పంచాయతీకి సొంత భవనం నిర్మించాలని ఆదేశించారు. గ్రామ జనాభా ఆధారంగా భవనాలను ‘ఏ, బీ, సీ’ కేటగిరీలుగా వర్గీకరించి నిర్మించాలని సూచించారు.
* 45 రోజులకు ఒకసారి మండల పరిషత్తు సమావేశాలు..
మండల స్థాయిలో అన్ని శాఖల అభివృద్ధి పనులను MPDOలు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి 45 రోజులకు ఒకసారి మండల పరిషత్ సమావేశాలు నిర్వహించి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలన్నారు. సర్పంచులు తమ గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చేందుకు ఇది దోహదపడుతుందన్నారు.
* ఎన్నికలు జరగని పంచాయతీలకు వెంటనే నిధులు..
వివిధ కారణాలతో ఎన్నికలు జరగని పంచాయతీల్లో పారిశుద్ధ్యం, ఇతర అత్యవసర పనులకు ఆటంకం కలగకుండా వెంటనే నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్య పనులపై పూర్తి బాధ్యత వహించాలన్నారు.
* ఇందిరమ్మ చీరలలో నాణ్యతతో రాజీపడేది లేదు..
కోటి మంది మహిళలకు పంపిణీ చేసే చీరలు అత్యుత్తమ నాణ్యతతో, ఆకట్టుకునే డిజైన్లలో ఉండాలని సీఎం స్పష్టం చేశారు. డిజైన్ల రూపకల్పన కోసం ‘నిఫ్ట్’ (NIFT) విద్యార్థుల సేవలను ఉపయోగించుకోవాలని, రంగులు, డిజైన్లలో రాజీపడొద్దని సూచించారు.
* తాగునీటి సరఫరాకు తొలి ప్రాధాన్యం..
ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ తాగునీటి సరఫరా, హైదరాబాద్ మెట్రో వాటర్, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అలాగే, గ్రామీణ తాగునీటి పథకాల్లో పనిచేసే సిబ్బందికి ప్రతి నెలా 5వ తేదీ లోపే వేతనాలు చెల్లించాలని సీఎం ఆదేశించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
