Danam Nagender Disqualification Case
* హైకోర్టు తీర్పు వాయిదా
* సెప్టెంబర్ 18న తుది తీర్పు వెల్లడి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై దాఖలైన రెండు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు తుది తీర్పు శుక్రవారానికి (సెప్టెంబర్ 18కి) వాయిదా పడింది. దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్లను స్పీకర్ గద్దం ప్రసాద్ కుమార్ కొట్టివేయడాన్ని సవూలు చేస్తూ భారస (BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, భాజపా శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వివాదంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం గత నెల 21న సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. వాస్తవానికి ఈ తీర్పును వెల్లడించాల్సి ఉండగా, తీర్పు పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడంతో సెప్టెంబర్ 18న వెవరిస్తామని ధర్మాసనం బుధవారం తెలిపింది.
*అసలు ఏం జరిగిందంటే..
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ స్థానం నుంచి గెలుపొందిన దానం నాగేందర్, ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాకుండా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా (కాంగ్రెస్ బీ-ఫారంతో) పోటీ చేయడం ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది.
ఆయన చట్టబద్ధంగా పార్టీ మారలేదంటూ స్పీకర్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును పిటిషనర్లు హైకోర్టులో సవాల్ చేశారు. దానం స్వచ్ఛందంగా బీఆర్ఎస్ సభ్యత్వాన్ని వదులుకున్నారని, ఆయన ప్రవర్తనను పరిగణనలోకి తీసుకోవాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు.
కాగా, ఇదే రీతిలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, టి. ప్రకాశ్ గౌడ్, అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్‌కుమార్, గూడెం మహిపాల్‌రెడ్డిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ వెలువరించిన తీర్పులను సవాలు చేస్తూ పలువురు భారాస ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
