Hyderabad Lakes Encroachment HYDRA Commissioner Ranganath
* హైదరాబాద్‌లో 69% చెరువులు ఆక్రమణ..
* హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ వల్ల సహజ నీటి వనరులు, చెరువులు ఆక్రమణల పాలవుతున్నాయని, ఫలితంగా భారీ వర్షాలు కురిసిన వేళ నగరాలు తీవ్ర వరద ముప్పును ఎదుర్కొంటున్నాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర సమయాల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వ వ్యవస్థలతో పాటు యువ ఆపదమిత్రులు నిరంతరం సద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నాగోలులోని హైడ్రా శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘యువ ఆపదమిత్ర’ ఐదో బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని కమిషనర్ శుక్రవారం ప్రారంభించి, వాలంటీర్లకు పలు కీలక సూచనలు చేశారు.
*చెరువులను కాపాడితేనే రక్షణ..
పట్టణాల విస్తరణ పర్యవసానంగా సహజ జల వనరులపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతోందని రంగనాథ్ స్పష్టం చేశారు. చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాలకు గురికావడంతో వర్షపు నీటి సహజ ప్రవాహ మార్గాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) ఉపగ్రహ చిత్రాల పరిశీలన ప్రకారం హైదరాబాద్ నగర పరిధిలోని 69 శాతం చెరువులు ఆక్రమణకు గురైనట్లు తేలిందని ఆయన వెల్లడించారు.
ఈ జల వనరులను కాపాడుకుంటూ, ప్రవాహ మార్గాలను పునరుద్ధరిస్తేనే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా అడ్డుకోగలమని పేర్కొన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం చెరువుల సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని, హైడ్రా సైతం నాలాల అభివృద్ధి, వరద నివారణపై ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు.
*విపత్తు రాకముందే నివారించడం ముఖ్యం..
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత సహాయక చర్యలు చేపట్టడమే కాకుండా, విపత్తులకు దారితీసే పరిస్థితులను ముందే గుర్తించి నివారించడమే అసలైన నిర్వహణ అని ఏవీ రంగనాథ్ అభిప్రాయపడ్డారు. పర్యావరణాన్ని కాపాడుతూ, వర్షపు నీరు సజావుగా చెరువులకు చేరేలా ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా నష్ట తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. నాలాలు, చెరువుల మధ్య ఉన్న ప్రవాహ వ్యవస్థను మెరుగుపరచడం వల్ల ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో వరద తీవ్రత తగ్గిందని గుర్తుచేశారు.
*ప్రమాదకరంగా అక్రమ నిర్మాణాలు..
నగరంలో నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న భవనాలు భద్రతకు పెద్ద సవాలుగా మారుతున్నాయని కమిషనర్ హెచ్చరించారు. కేవలం 50 గజాల చిన్న స్థలంలో ఏడు నుంచి ఎనిమిది అంతస్తుల భవనాలు నిర్మించడం అత్యంత ప్రమాదకరమన్నారు. గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో భవనం కూలిన ఘటన, సిద్ధిఖ్నగర్లో భవనం పక్కకు వాలడం వంటి ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని ప్రస్తావించారు. నిర్మాణ నిబంధనలు కచ్చితంగా పాటిస్తేనే ఇటువంటి ప్రమాదాలను అరికట్టవచ్చని స్పష్టం చేశారు.
*సేవా రంగంలో యువత భాగస్వామ్యం ప్రశంసనీయం
విద్యనభ్యసిస్తూనే సామాజిక స్పృహతో ఆపదమిత్రులుగా సేవలందించేందుకు ముందుకు వచ్చిన యువతను రంగనాథ్ కొనియాడారు. స్థానిక పరిస్థితులు, కాలనీల భౌగోళిక అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండే యువ వాలంటీర్లు అత్యవసర వేళల్లో త్వరితగతిన స్పందించగలరని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రమాద సంకేతాలను గుర్తించిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసి, సహాయక చర్యల్లో భాగస్వామ్యం కావాలని కోరారు.
*117 మంది వాలంటీర్లకు ప్రతిష్టాత్మక శిక్షణ
ఐదో బ్యాచ్ కింద హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన వివిధ కళాశాలల 117 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరికి వారం రోజుల పాటు వరదలు, ప్రమాదాల నివారణ, బాధితులకు తక్షణ ప్రాథమిక సాయం అందించడం, ప్రభుత్వ శాఖలతో సమన్వయం వహించడంపై సమగ్ర అవగాహన కల్పిస్తారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైడ్రా అదనపు డైరెక్టర్ వర్ల పాపయ్య, అదనపు కమిషనర్లు ఆర్. సుదర్శన్, డి. ఆనంద్‌కుమార్, ఏడీఎఫ్‌వో మోహన్‌రావు, ఆర్ఎఫ్వో జయప్రకాశ్, డీఎఫ్‌వోలు శ్రీధర్‌రెడ్డి, గౌతమ్, మై భారత్ అధికారి శశాంక్, స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా అధికారిణి గ్రీష్మ చంద్రిక తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
