Sangem Police Station Inspection
* బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని ఆదేశం
ఆకేరు న్యూస్, వరంగల్: శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసు వ్యవస్థ పనితీరును మరింత మెరుగుపరచడంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపిఎస్, సంగెం పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈస్ట్ జోన్ పరిధిలోకి వచ్చే ఈ ఠాణాకు చేరుకున్న సీపీకి ఉన్నతాధికారులు మరియు స్థానిక సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.
* మొక్క నాటి.. గౌరవ వందనం స్వీకరించి..
పోలీస్ స్టేషన్ ప్రాంగణానికి చేరుకున్న కమిషనర్‌కు సాయుధ పోలీసులు సంప్రదాయ గౌరవ వందనం (Guard of Honor) సమర్పించారు. అనంతరం ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మామూనూర్ ఏసీపీ వెంకటేష్, పర్వతగిరి సీఐ రాజగోపాల్ మరియు సంగెం ఎస్.ఐ వంశీ కృష్ణలు పూల మొక్కలతో సిపికి స్వాగతం పలికారు. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇస్తూ సీపీ శ్వేత ఠాణా ఆవరణలో మామిడి మొక్కను నాటారు.
* కేసుల పురోగతిపై ఆరా..
అనంతరం పోలీస్ స్టేషన్‌లోని ప్రధాన రికార్డులు, మాల్ఖానా, కేస్ డైరీలు, స్టోర్ రూమ్‌లతో పాటు సిబ్బంది విధులకు ఉపయోగించే కిట్ సామాగ్రిని సిపి నిశితంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసులు, నేరాల సరళి, విజిబుల్ పోలీసింగ్, రౌడీషీటర్ల కదలికలు మరియు రాత్రి పెట్రోలింగ్ నిర్వహణపై ఎస్.ఐ వంశీ కృష్ణను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో మాట్లాడి వారి వృత్తిపరమైన, వ్యక్తిగత సమస్యలను స్వయంగా సేకరించారు.
సిబ్బందికి ముఖ్యమైన ఆదేశాలు &బాధితులకు ప్రాధాన్యత… స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులను గౌరవిస్తూ వారి సమస్యలను ఓపికగా వినాలి. చట్టపరిధిలో త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. డయల్-100 నుంచి పిలుపు రాగానే క్షణాల్లో స్పందించి సంఘటనా స్థలానికి చేరుకోవాలి. విధుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరి. అవినీతికి ఏమాత్రం ఆస్కారం ఉండకూడదు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వార ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుకొని, వారిలో పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచాలి.
ఈ వార్షిక తనిఖీ కార్యక్రమంలో డీసీపీ అంకిత్ కుమార్, ఏసీపీ వెంకటేష్, పర్వతగిరి సీఐ రాజగోపాల్‌తో పాటు పర్వతగిరి ఎస్.ఐ ప్రవీణ్, ఐనవోలు ఎస్.ఐ అశోక్ కుమార్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
